విదేశాలలో భారత్ గురించి ఒక్క గొప్ప విషయాన్ని ఇంకా గొప్పగా చెబుతారు. ఇండియాలో పలుకుబడి, డబ్బు ఉంటే ఎంత నేరం చేసినా బయటకు రారని, మహా అయితే బినామీలు అరెస్ట్ అవుతారే గానీ నిజమైన దోషులకు మాత్రం శిక్షపడదనేది విదేశీయులే కాదు... దేశ వ్యాప్తంగా కూడా అందరు ఒప్పుకునే మాట ఇదే. ఇక నాడు సల్మాన్ ఖాన్ మద్యం మత్తులో ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వారిని కారుతో యాక్సిడెంట్ చేసి పక్కాగా దొరికిపోయినా కూడా అప్పుడు తాను కూడా.. తన డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్నాడని చెప్పి హిట్ అండ్ రన్ కేసు నుంచి తప్పించుకున్నాడు.
ఇంకా సల్మాన్‌కే చెందిన కృష్ణ జింకల కేసు, ఇక దావూద్ ఇబ్రహీం నుంచి విజయ్‌మాల్యా, లలిత్ మోదీ వరకు ఇదే వరుస. ఇక ఏదో కాస్త నిజాయితీ కలిగిన వ్యక్తి కాబట్టి సంజయ్ దత్ అరెస్ట్ అయినా కూడా సునీల్ దత్ పట్టించుకోలేదు. నాడు బాల్ ఠాక్రే నుంచి ప్రధాన మంత్రుల వరకు తన సన్నిహితులైనా తన కొడుకు కేసు విషయంలో జోక్యం చేసుకోలేదు. ఇక విషయానికి వస్తే తమిళ హీరో 'జై' అదేనండీ మన సీతమ్మ అంజలి చేసుకోబోయే వాడుగా అనుకుంటోన్న, 'జర్నీ, రాజురాణి' ద్వారా తెలుగు వారికి కూడా సుపరిచితమై ప్రస్తుతం అంజలితో 'బెలూన్' చిత్రం చేస్తున్న హీరో, గత నెల 21న మద్యం తాగి కారు నడుపుతూ స్థానిక అడయార్ బ్రిడ్జ్ వద్ద యాక్సిడెంట్ చేశాడు. పోలీసులు కేసును రిజిష్టర్ చేసి సైదాపూర్ మెజిస్ట్రేట్ వద్ద చార్జిషీట్ దాఖలు చేశారు.
ఈ కేసులో కోర్టుకి మూడవ తేదీన హాజరైన జై చార్జిషీట్‌ని అందుకున్నాడు. ఈ కేసు గురువారం మెజిస్ట్రేట్ అబ్రహం లింకన్ ఆధ్వర్యంలో జరిగిన విచారణకు జై హాజరుకాలేదు. దీంతో న్యాయమూర్తి ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ, శుక్రవారం కోర్టుకి రావాలని ఆదేశించారు. జై శుక్రవారం కూడా కోర్టుకి హాజరు కాలేదు. ఆయన అజ్ఞాతంలో ఉన్నాడని పోలీసులు అంటున్నారు. దీంతో జైని రెండు రోజుల్లోగా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశాడు. విచారణను 10వ తేదీకి వాయిదా వేశారు. మహా అయితే ఓ రెండు మూడు వేలు నష్టపరిహారం విధిస్తారు.. అంతకు మించి మన చట్టాలు, శిక్షలు, అధికారులు ఏమీ చేయలేరని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.