పవన్ కల్యాణ్ క్రేజ్ మెగాభిమానుల వల్లే కాదు.. ఆయన వ్యక్తిత్వం, ఆయన ఆశయాలను చూసి కూడా పలువురు న్యూట్రల్ వ్యక్తులు పవన్‌కి ఫ్యాన్‌గా మారుతున్నారు. కానీ అభిమానులు చూపించే అత్యుత్సాహం, ఆయన సామాజిక వర్గం వారు వాడు మనోడురా అని మాట్లాడుతుండటమే పవన్‌కి మైనస్ అవుతోంది. కానీ ఆయన దానిపై దృష్టి సారించడం లేదు. ఆయన మొదటి ప్రసంగంలోనే కాపులు ఎవరు? నన్ను కమాండ్ చేయడానికి వారెవ్వరు? నాకు అలాంటి కుల సంఘాలు అవసరం లేదని ఘాటుగా చెప్పాడు.
ఇక చిరంజీవి, దాసరి, ముద్రగడ పద్మనాభం వంటివారు కాపుల రిజర్వేషన్ విషయంలో తమతో కలిసి పోరాటానికి రావాలంటే ఆయన అందుకు ముందుకు రాలేదు. కేవలం చంద్రబాబు తాను ఎన్నికల హామీలో ఇస్తానని చెప్పాడు కదా..! మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు? నాడు దీనిని వ్యతిరేకిస్తున్న బిసీ సంఘాలు ఎందుకు మౌనంగా ఉన్నాయి? ప్రజాస్వామ్య బద్దంగా ముద్రగడ పాదయాత్ర చేయడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలు వంటి విధాన నిర్ణయాల పరంగా ప్రశ్నించాడే గానీ కులం రంగు పూసుకోలేదు.
ప్రజారాజ్యం పార్టీని.. రాజ్యసభ హోదా, ముణ్ణాళ్ల ముచ్చటగా నిలిచిన కేంద్రమంత్రి పదవికి చిరంజీవి, సోనియా కాళ్ల వద్ద తాకట్టుపెట్టాడు. అదే నాడు చిరంజీవి ఆ పనిచేయకపోయి ఉంటే పీఆర్పీ ప్రస్తుతం వేరేరకంగా ఉండేది. ఇక తాజాగా కూడా చిరు తీసుకున్న ఓ నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది.
ఈనెల 10న జరిగే పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక నేపధ్యంలో ఆయన ఏరికోరి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పిసిసి సభ్యత్వం అడిగి మరీ తీసుకున్నాడు. దీని వెనుక ఉద్దేశ్యం ఏమిటో అందరికీ తెలిసిందే. అయినా చిరంజీవి ఇమేజ్‌కి ఏ మాత్రం సరిపడని ఈ పదవి కోసం పట్టుబట్టి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా వున్న చిరుకి ఇంకా ఆశ ఉండటం చూస్తుంటే, పదవిని తుచ్ఛం అన్న తమ్ముడి భావాలే బాగున్నాయని నొక్కి వక్కాణించవచ్చు.