ప్రస్తుతం ఉన్న కమర్షియల్ డైరెక్టర్లలో రాజమౌళి, వినాయక్, బోయపాటి శ్రీను వంటి వారికి లేని ప్రత్యేకత దర్శకరచయిత కొరటాల శివకు ఉంది. దానికి కారణం కూడా ఉంది. తాను తీసే చిత్రాల ద్వారా తనకు తెలిసినంత, తనకు అవగాహన ఉన్న విషయాలను సినిమాలో అంతర్లీనంగా ఇమిడిస్తూ సినిమాకి సామాజిక బాధ్యత కూడా ఉందనే కోణంలో కొరటాల శివ ఉంటాడు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ కోణంలో చూసుకుంటే కొరటాల శివనే గ్రేట్. కెరీర్ ప్రారంభంలోనే స్టార్స్‌తో చిత్రాలు తీసే అవకాశాలు వచ్చినా ఆయన అదే దృష్టిలో ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాడు.
ప్రస్తుతం ఆయన 'శ్రీమంతుడు' క్రేజ్‌ని వాడుకోవాలని కాకుండా తనదైన శైలిలో ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, కొత్తగా రాజకీయాలలోకి ప్రవేశించే వారు సమాజం పట్ల ఎంత నిబద్దతతో ఉండాలనే కాన్సెప్ట్‌తోనే ఆయన 'భరత్ అనే నేను' చిత్రం తీస్తున్నాడు. ఈ చిత్రం చూసి ఒక్క రాజకీయ నాయకుడు ఆలోచన మారినా, లేదా ఇలాంటి నాయకులే ఉండాలి అనే ఆలోచన ప్రేక్షకుల్లో తెప్పించినా ఆయన భగీరధ ప్రయత్నం సఫలమయినట్లే.
ఇక తాజాగా ఆయన కూడా 'స్పైడర్' దెబ్బతో ఇంకా కేర్ తీసుకుంటున్నాడు. కథను మరింతగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం ఎలా? 'స్పైడర్' దెబ్బతో తన సినిమాకు నిర్మాతకు బిజినెస్ పరంగా ఇబ్బందులు రాకుండా ఎలా చూసుకోవాలి? అనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. కానీ తాజాగా ఈచిత్రానికి సంబంధించిన మహేష్‌బాబు స్టిల్ ఒకటి లీకయింది. ఇది చిత్రానికి ఆయువు పట్టు వంటి ఫొటో అట. దాంతో ఆయన మీడియాకు కావాలంటే మిగిలిన పిక్స్ పంపిస్తాను. దయచేసి ఈ లీకయిన ఫోటోని మాత్రం షేర్ చేయకండి అని ఆయన నెటిజన్లను, సోషల మీడియాను, చివరకు మహేష్ అభిమానులని కూడా బతిమిలాడుకున్నంత పని చేశాడు.
కానీ సోషల్ మీడియాలో మానవత్వం ఉన్న కొందరు తప్ప మిగిలిన వారిని ఆపగలిగేదెవ్వరు? అందునా మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఆయన యాంటీ ఫ్యాన్స్ కూడా తమకు గిట్టని హీరోకి సంబంధించి ఇంపార్టెంట్ పిక్ కావడంతో దానిని విస్తరించే పనులు చేయరని గ్యారంటీ లేదు. నిజంగా కొందరు పెద్దస్టార్స్‌కి చెందిన చిత్రాలను కూడా చిత్ర యూనిట్టే లీక్ చేసి తర్వాత హంగామా చేసేవారు ఎందరో ఉన్నారు. కానీ కొరటాల ఆ కోవకి చెందిన వ్యక్తి కాకపోవడంతో ఆయన పరిస్థితి నిజంగానే బాధ కలిగిస్తోంది.