మలయాళంలో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ జోరు మాములుగా లేదు. సూపర్ స్టార్ మమ్ముట్టి కొడుకు దుల్కర్ సినిమాలు వరుసబెట్టి హిట్ అవడంతో స్టార్ హీరో రేంజ్ లో దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. తండ్రికి తగ్గ తనయుడిగా దుల్కర్ మలయాళ పరిశ్రమలో ఎదుగుతున్నాడు. మంచి మంచి కథలతో సినిమాలు చేస్తూ వరుస విజయాలను అందుకుంటున్నాడు. ఇప్పుడు కూడా తాజాగా బిజయ్ నంబియార్ కథ, కథనం, దర్శకత్వం వహించిన 'సోలో' చిత్రంతో దుల్కర్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ 'సోలో' చిత్రం తమిళ, మలయాళంలో ఈ గురువారమే విడుదలై... పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మళయాళంతో పాటే తమిళంలోనూ 'సోలో' చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి ఈ చిత్రంలో దుల్కర్ నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించాడు. దుల్కర్ నటనకు మళయాళీలతో పాటు తమిళులు కూడా ఫిదా అవుతున్నారు. దుల్కర్ నటనకు విమర్శకులు సైతం ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. ఇక దర్శకుడు బిజయ్ నంబియార్ సోలో చిత్రాన్ని అద్భుతమైన కథతో అత్యంత అద్భుతంగా తెరకెక్కించాడని... అలాగే దర్శకుడుకి తగ్గ హీరో ఈ సినిమాకి దొరికాడని అంటున్నారు.
దుల్కర్ సరసన నేహాశర్మ, ధన్సిక, శ్రుతి హరిహరన్, ఆర్తి వెంకటేశ్ లు నటించిన ఈ చిత్రంలో దుల్కర్ భూమి, నీరు, నిప్పు, గాలిని ప్రతిబింబించే డిఫరెంట్ లుక్స్ తో అదరగొట్టాడని... ప్రతి పాత్రలో దుల్కర్ దున్నేశాడని అంటున్నారు. రెండు పాత్రల్లో ప్రేమికుడిగా ఆకట్టుకున్న దుల్కర్ మరో రెండు పాత్రల్లో గ్యాంగ్ స్టర్ గా, ఆర్మీ ఆఫీసర్ గా అద్భుతంగా నటించాడని ఆకాశానికెత్తేస్తున్నారు. ఇక సోలో సినిమాకి మెయిన్ ఎస్సెట్ సినిమాటోగ్రఫీ అని చెబుతున్నారు. ఈ దుల్కర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. మణిరత్నం 'ఓకే బంగారం'తో ఆకట్టుకున్న దుల్కర్ ప్రస్తుతానికి 'హే పిల్లగాడా' అంటూ తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికే కాదు.. 'మహానటి' సావిత్రి బయోపిక్ లో జెమిని గణేశన్ పాత్రలో కూడా నటిస్తున్నాడు.