రాజధానిలోనే కాదు.. అన్ని రాష్ట్రాలలోని ఓ మోస్తరు పట్టణాలలో కూడా ట్రాఫిక్ అంతరాయం ప్రధాన సమస్యగా మారుతోంది. దీనికితోడు వాహన కాలుష్యం, అస్తవ్యస్త పరిస్థితి, చిన్న చినుకు పడితే సంద్రంగా మారడం, మ్యాన్‌హోల్స్ వంటి సమస్యలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఒక్క ఢిల్లీలో ఒక రోజంతా బైక్ మీద ప్రయాణిస్తే ఒక వ్యక్తికి రెండు మూడు ప్యాకెట్ల సిగరెట్ కాల్చినంత కాలుష్యం, ప్రమాదం ఉందని సర్వేలు చెబుతున్నాయి.
ఇక తాజాగా మంచు మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మిప్రసన్న హైదరాబాద్‌లోని హైటెక్స్ ఏరియాలో ట్రాఫిక్ అంతరాయంలో దాదాపు ఒకటిన్నర గంట వెయిట్ చేసిందట. ఇక ప్రజాప్రతినిధులకు మాత్రం వారు వస్తుంటే చాలా ప్రోటోకాల్ పాటిస్తూ పోలీసులు నానా హంగామా చేస్తారు. నేతలు వచ్చినప్పుడే ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటోంది. చివరకు అత్యవసరమైన అంబులెన్స్‌లకి కూడా ఇవ్వని ప్రాధాన్యత మనం రాజకీయ నాయకులకు ఇస్తున్నాం. దీనిపై అందరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎంత పెద్ద నాయకులైనా మాలాంటి సామాన్యులుగా ఎలాంటి ప్రోటోకాల్, పోలీస్ సహాయం లేకుండా ఈ రోడ్లపైకి వస్తేనే వారికి అసలు విషయం అర్ధమవుతుంది.. అని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇది నిజమే. నేటి రాజకీయ నాయకులు నేడున్న రోడ్లపై సామాన్యులుగా తిరగాలి. అలాగే మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం సాధారణ ప్రజలు వైద్యం కోసం వెళ్లే వైద్యశాలల్లో, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో తమ పిల్లలను చదివించాలి. ఎక్కడో కూర్చుని పాలన చేయడం కాదు.. మురికివాడల్లో ప్రతి ఒక్కరికి వ్యాపిస్తున్న డెంగ్యూ, వైరల్ ఫీవర్ వ్యాపిస్తున్న దోమల మద్యనే వారు నివాసం ఉండాలి. అప్పుడు గానీ ఈ రాజకీయ నాయకులకు బుద్దిరాదు. అధికారాన్ని కట్టబెట్టే ప్రభువులైన ఓటర్లని కాదని, రాజకీయ నాయకులు తమ సోకులు,షికార్లు చెల్లవని తెలిసేలా చేయాలి.