ఏ హీరో అభిమానులకు ఆయా హీరోలు దేవుళ్లే కావచ్చు. కావాలంటే వారి కోసం ప్రాణాలకు తెగించి ఇతర హీరోల ఫ్యాన్స్‌తో తగవులు, చంపుకోవడాలు, ఫ్లెక్సీలను చించి వేయడం, కటౌట్లకు, ఫ్లెక్సీలు కట్టే సమయంలో కరెంట్ తీగలకి తగిలో, మరో విధంగానో దుర్మరణం చెందడం, తమను పుట్టించి, పెంచి, కట్టుకున్న వారిని హీరోల కోసం పట్టించుకోకపోవడం, ఇలా పిచ్చి పలు విధాలు. నిజానికి నేడు ఫ్యాన్స్ పేరుతో తగవులు పెట్టుకుని, తీవ్రంగా స్పందిస్తున్న వారు నిరక్ష్యరాసులు మాత్రం కాదు. నిరక్ష్యరాస్యులైతే కనీసం చదువు, సంస్కారం నేర్పిస్తే వస్తాయని భావించవచ్చు.
కానీ హీరోల పేరుతో, కులం కంపులో కొట్టుకుంటోంది బాగా ఉన్నత చదువులు చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ, సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారే కావడం శోచనీయం. ఇక సిని హీరోల అభిమానుల మధ్య కులం కంపు కొట్టడం చూస్తే ఎవరైనా ఏహ్యభావం తెచ్చుకోవాల్సిందే. అసలు చదువుకున్న వారు ఎక్కువగా వాడే సోషల్ మీడియాలో తమ హీరోకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని, కామెంట్ చేసిన వారిని తిడుతున్న భాష చూస్తుంటే కడుపుమండుతుంది. ఏడేళ్లు పవన్‌కి దూరంగా ఒంటిరిగా ఇద్దరు పిల్లలతో ఉన్న రేణుదేశాయ్ తనకు ఆపదలో నా అనే వాళ్లు ఉండాలని, ఏమో దేవుడు తగిన మనిషిని పంపిస్తే వివాహం చేసుకుంటానేమో అనడంలో తప్పేముంది? ఆమె అన్నట్లుగా ఆమె జీవితాంతం పవన్ మాజీ భార్యగా, తప్పుచేశాననే ఒంటరితనంలో, భావనలోనే ఉండాలా? ఇలా పురుషాధిక్యం చూపించి, పవన్ మూడు పెళ్లిళ్ల సంగతి ప్రస్తావిస్తే బూతులు తిట్టే ఈ ఫ్యాన్స్‌కి అసలు పవన్ చేసింది తప్పు కాదని వాదించే వీరు.. రేణుదేశాయ్‌ని తప్పుపట్టడం ఏమిటి?
దీనిపై తాజాగా పవన్ వ్యతిరేకిగా ఆయన ఫ్యాన్స్ నుంచి ఎన్నో బెదిరింపులు అందుకున్న మహేష్‌కత్తి తన గళమెత్తాడు. పవన్ ఫ్యాన్స్ రేణుదేశాయ్‌పై చేస్తున్న కామెంట్స్ చూస్తే పీకే ఫ్యాన్స్ పిచ్చి పీక్స్‌కి ఉందని అర్దమవుతోందని వ్యాఖ్యానించాడు. ఓ అభిమాని తన పోస్ట్‌పై అభ్యంతరం చెబితే, పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్ రేణుదేశాయ్ వ్యక్తిగత జీవితంలోకి ఎందుకు వెళ్తున్నారని మహేష్ కత్తి నిలదీశాడు. ఏడు సంవత్సరాల ఒంటరితనం తర్వాత రేణుదేశాయ్ పెళ్లి చేసుకోవాలని ఉంది అంటే పవన్ ఫ్యాన్స్‌కి ఎందుకంత అభ్యంతరం.? ఆ తిట్టడం ఏమిటి? ఆ ట్రాల్స్ ఏమిటి? ఆ మూర్ఖత్వం ఏమిటి? ఇంత పర్వర్టెడ్ భావజాలం ఏమిటి? ఇవేమీ కనిపించనంతగా మీ కళ్లు మూసుకుని పోవడం ఏమిటి? నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది... అని మహేష్ కత్తి అన్నాడు.
పవన్ ఫ్యాన్స్ ఇకనైనా మారాల్సివుంది. లేదా వారే తమ అభిమాన హీరోను వివాదాలలోకి నెట్టినవారవుతారు. సామాన్యులు పవన్‌ని ధూషించేంతగా పరిస్థితి చేయి దాటుతుంది. ఇక పవన్ విషయానికి వస్తే ఆయన తన ఫ్యాన్స్ ఏమి చేసినా సరైనదే అనే రీతిలో మౌనంగా ఉండి మౌనం అర్దాంగీకారం అన్నట్లుగా ఎందుకు తమాషా చూస్తున్నాడు? ఇతరుల ఆడియో ఫంక్షన్లలో గొడవల నుంచి కత్తి మహేష్ వరకు, చివరికి తన మాజీ భార్య రేణుదేశాయ్‌ని సైతం తన అభిమానులు వేధిస్తుంటే.. సమాజంలోని దేని దేని మీదనో ప్రశ్నించాలని చెప్పే పవన్ తన అభిమానులను ఆ విషయంలో ముందుగా ప్రశ్నించాలి. వారి పద్దతి మార్చుకోవాలని ఆయనే స్వయంగా చెప్పాలి. లేదా ఊరికో కత్తి మహేష్‌లు పుట్టుకొస్తారు.. ఇది ఖచ్చితం...!