తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితలు నటులుగా, దర్శకులుగా మారుతుండటంతో వారి కొరత బాగా ఎక్కువైంది. కానీ రచయితగా అన్ని పర్‌ఫెక్ట్‌గా ఉండే సాయిమాధవ్ బుర్రా వంటి వారు మాత్రం తాము ఇంకా రచయిత వృత్తిని కాపాడుతున్నారనే చెప్పాలి. 'కృష్ణం వందే జగద్గురుం, గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీనెంబర్ 150' ఇలా పలు చిత్రాలకు ఆయన రచయితగా పనిచేశారు. విభిన్న చిత్రాలకు పనిచేస్తున్న ఆయనలోని ప్రతిభను ముందుగా గుర్తించి ప్రోత్సహించింది మాత్రం పవన్‌కళ్యాణ్ అనే చెప్పాలి. ఆయన తన 'గోపాల..గోపాల' ద్వారా ఈయన కెరీర్‌కి పెద్ద మెట్టు వేశారు. ఇక ఆయన ప్రస్తుతం 'మహానటి' చిత్రానికి రచయితగా పనిచేస్తున్నాడు. 'మహానటి' అనే బయోపిక్ సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రమని అందరికీ తెలుసు.
చిన్ననాటి నుంచి పాత సినిమాలు ఎక్కువగా చూసేవాడినని, నాటి మహనీయులైన ఎన్టీఆర్, ఏయన్నార్, సావిత్రి, జమున, భానుమతి, ఎస్వీరంగారావు.. వంటి గొప్ప నటుల చిత్రాలను చూసి అభిమానించేవాడిని. నేను చూసిన సినిమాలలోని పాత్రల వారికి నేనే డైలాగ్‌లు తెరపై రాయడం తనకు ఎంతో ఆనందాన్నిస్తోందని చెబుతున్నాడు. నాడు చూసిన పాత చిత్రాల పరిజ్ఞానం తనకు ఇప్పుడు పనికి వచ్చిందని, సావిత్రి అంటే పరిపూర్ణ జీవితాన్ని, భగవంతుడిచ్చిన ప్రతి ఎమోషన్‌ని అనుభవించిన గొప్ప వ్యక్తి ఆమె. ప్రేమిస్తే పూర్తిగా ప్రేమించడం, మోసపోతే పూర్తిగా మోసపోవడం, నమ్మితే గుడ్డిగా నమ్మేయడం, ద్వేషిస్తే పూర్తిగా ద్వేషించడం, ఇలా ఆమె జీవితంలో అన్ని ఎమోషన్స్‌ని అనుభవించింది. అలవిమాలిన కీర్తిప్రతిష్టలు. అంతలోనే నేలకు పడిపోవడం, పూర్తిగా చనిపోవడం, చివరకు ఒక గొప్ప విషయం ఏమిటంటే... ఆమె పుట్టినప్పుడు ఎంత బరువు ఉందో చనిపోయే రోజు కూడా అంతే బరువు ఉంది. ఈ సినిమా చూస్తే మీకే నేనెందుకు ఇలా చెబుతున్నానో అర్ధమవుతుంది. ఇక ఈ చిత్రంలో సావిత్రి పెదనాన్నగా రాజేంద్రప్రసాద్, నిర్మాత చక్రపాణిగా ప్రకాష్‌రాజ్, ఇంకా ఎన్టీఆర్, ఏయన్నార్, ఎస్వీరంగారావుల పాత్రలు కూడా ప్రకటిస్తే ఇది ఇండస్ట్రీలో బిగ్ క్యాస్టింగ్ చిత్రం అవుతుంది.
ఇక నాగ్ అశ్విన్ గొప్ప దర్శకుడు. ఆయనేంటో 'ఎవడే సుబ్రహ్మణ్యం'తోనే తెలిసింది. ఏదో సినిమాలు తీయాలి. గొప్పపేరు సంపాదించాలనే ఆదుర్దా ఆయనలో కనిపించవు. నిజంగా ఆయన ఎంతో మంచి డైరెక్టర్.. ఇక 'మహానటి'కి నేను రాసేటప్పుడు ఎన్నోసార్లు కళ్ల నిండా నీళ్లొచ్చి కదిలిపోయాను. అది ప్రేక్షకులకు కూడా అనుభవభూతం అవుతుంది. ఇక సావిత్రిని అభిమానించే వారు జెమిని గణేషన్‌ని విలన్‌గా చూస్తారు. వాస్తవంలోకి వెళ్లితే అది నిజం కాదేమో.. అంత గుడ్డిగా నమ్మడం సావిత్రి తప్పేమో అనిపిస్తుంది... అంటూ చెప్పుకొచ్చారు సాయిమాధవ్ బుర్రా.
ప్రస్తుతం ఆయన 'ఖైదీనెంబర్ 150' తర్వాత 'సై రా..నరసింహారెడ్డి'కి, ప్రభాస్ నటిస్తున్న 'సాహో' చిత్రానికి, కృష్ణ కూతురు మంజుల స్వంత దర్శకత్వంలో సందీప్‌కిషన్ హీరోగా తీస్తున్న ప్రేమకథా చిత్రానికి, 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్న ఫిక్షన్, ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందే చిత్రానికి, ఇక శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తున్న 'సాక్ష్యం' చిత్రానికి తానే రచయితగా పనిచేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు.