ఒకప్పుడు ఆడదంటే చులకనగా చూసేవారు. కానీ నాటి ఇందిరాగాంధీ, సోనియాగాంధీ నుంచి జయలలిత, మమతా బెనర్జీ వంటి ఎందరో మహిళలు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అయితే ఆడవారు రాజకీయాలలోకే కాదు... ఏ రంగంలోనైనా రాణిస్తారని చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఇక ఆడవారు రాజకీయాలలోకి కూడా వచ్చి మహా ఉద్దండులైన నేతలను కూడా ఢీకొని తమ సత్తా చాపారు. అయితే అభ్యంతరమల్లా..... మహిళలకు రాజ్యాధికారం పేరుతో స్త్రీలకు రిజర్వేషన్లు ఇచ్చినంత మాత్రాన స్త్రీ తన సత్తాను చూపలేదు. ఏవైనా సీట్లను మహిళలకు కేటాయిస్తే వారు నామ్‌కే వాస్తే గెలిచి ఇళ్లలోనే గడుపుతున్నారు. ఆమె పదవిని, అధికారాన్ని ఆమె ఇంట్లోని ఆమె భర్తల్లో, కుమారులలో చూసుకుంటున్నారు.
ఇక విషయానికి వస్తే తమిళనాట రాజకీయ సమీకరణలు, రాజకీయ వేడి రాజుకుంటున్న సమయంలో నాటి స్టార్ హీరోయిన్, లెజండరీ దర్శకుడు మణిరత్నం భార్య సుహాసిని మణిరత్నం చేసిన వ్యాఖ్యలు మాత్రం బాగా ఆసక్తిని రేపుతున్నాయి. తమిళనాట రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపధ్యంలో రజనీకాంత్, కమల్‌హాసన్‌లు రాజకీయాలలోకి వస్తున్నారని వార్తలు వస్తున్న నేపధ్యంలో సుహాసిని మణిరత్నం మాట్లాడుతూ.. 'హీరోలే రాజకీయాలలోకి రావాలా? మేము రాజకీయాలలోకి రాకూడదా...? తమిళ ప్రజలు జయలలితకు పెద్ద బాధ్యతను ఇచ్చారు. మాకూ ఆ బాధ్యతలను అందించండి. రాజకీయాలలోకి రావడానికి మేము కూడా సిద్దంగా ఉన్నాం' అని వ్యాఖ్యలు చేసింది. సుహాసిని మణిరత్నంతో పాటు నిన్నటితరం నటీమణులైన రాధిక, రేవతి, పూర్ణిమా భాగ్యరాజ్, నదియా వంటి వారు కూడా రాజకీయాలలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
అయితే అధికారం అనేది ఎవరో ఇస్తే వచ్చేదో లేదా కొనుక్కునే ఆటబొమ్మో, లేక రెమ్యూనరేషన్ తీసుకుని నటించడమో కాదు.. రాష్ట్రంలోని ప్రజలను ఒప్పించి మెప్పించి, వీరు కూడా పరిపాలనాధక్ష్యత ఉన్నవారని ప్రజల మెప్పును పొందితే అధికారం సాధిస్తారు. అంతేగానీ టీవీలో, మైకులు పట్టుకుని మాట్లాడితే రాజ్యాధికారం రాదు. సుహాసిని మణిరత్నం వంటి వారు వచ్చి జయలలితలాగా ఉక్కుమనుషులుగా నిరూపించుకుంటే అది వారికి కూడా సాధ్యమే. అందునా మణిరత్నం, సుహాసిని కుమారుడికి రాజకీయాలంటే చాలా ఆసక్తి. ఆయన ఇప్పటికే సమకాలీన రాజకీయాలపై ఓ పుస్తకం కూడా రాశాడు. కాబట్టి రాజకీయాలలోకి రావాలా? వస్తే రాణిస్తామా? లేదా? అనే నిర్ణయం వారి చేతుల్లోనే ఉంది.