ప్రస్తుతం దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేని ఎన్నికల వేడి తమిళనాడులో ఏర్పడి ఉంది. రజనీని మోదీ, అమిత్‌షాలు బిజెపిలోకి ఆహ్వానించడం, కానీ బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి రజనీని తీవ్రంగా విమర్శించడంతో బిజెపి డబుల్‌గేమ్ ఆడుతోందా? రజనీ వస్తే తమ పార్టీలోకే రావాలని, లేకపోతే ఆయన అసలు రాజకీయాలలోకి రాకూడదనే ధోరణి బిజెపి అధిష్టానంలో కనిపిస్తోంది. రజనీకి చెందిన అనేక ఆర్ధిక చిట్టాలు తన వద్ద ఉన్నాయని, ఆయనకు రాజ్యాంగం చదవడం కూడా రాదని స్వామి తీవ్ర విమర్శలు చేశాడు.
తద్వారా వస్తే బిజెపిలోకి రా.. లేకపోతే నీ చిట్టాను విప్పుతామని బిజెపి ఒక విధంగా చెప్పాలంటే బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఇక నా రూటే సపరేట్ అనే కమల్‌హాసన్ మాత్రం రజనీలా తాత్సారం చేయకుండా తాను సొంత పార్టీని పెడుతానని ప్రకటించాడు. రజనీ వస్తే కలుపుకుని పోతాను అంటూనే ఆయనకు ఉన్న మత విశ్వాసాల పరంగా ఆయనకు 'కాషాయం' పార్టీనే బెటర్ అని కూడా వ్యంగాస్త్రాలు సంధించాడు.
ఇక రజనీ కూడా రాజకీయాలలోకి వస్తారని నాడు ఆయన ఆప్తమిత్రుడు తెలిపాడు. దానికి సంబంధించిన విధి విధానాల గురించి కూడా చర్చ సాగుతున్నాయని అన్నాడు. ఇక బయటి వారందరూ ఏవేవో వ్యాఖ్యానాలు చేయడం పట్టించుకోవాల్సిన విషయం లేకపోయినా తాజాగా రజనీకాంత్ అర్ధాంగి లతా రజనీకాంత్ మాత్రం రజనీ రాజకీయప్రవేశంపై ఇన్‌డైరెక్ట్‌గా సూచనలు ఇచ్చిందని చెప్పాలి. ఆమె మాట్లాడుతూ, రజనీకాంత్ త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడని, ఆయన రాజకీయాలలోకి వస్తే సమాజానికి మంచి జరుగుతుందని, ఖచ్చితంగా ఆయన విజయం సాధిస్తారని మీడియాకు చెప్పడం చూస్తే ఇక రజనీ పొలిటికల్ ఎంట్రీ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని తేటతెల్లమవుతోంది.
అయితే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండటంతో రజనీ తన పార్టీని పరిస్థితులను, కమల్‌హాసన్ ఎంట్రీ తర్వాత మారబోయే సామాజిక పరిణామాలు వంటి వాటిని చూసి తాను అడుగువేస్తాడని అంటున్నారు. ఇక లతా రజనీకాంత్ శ్రీదయా అనే ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్నారు. సమావేశంలో తమ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరిస్తున్నారు. అయితే రజనీ బిజెపితో ముందుకెళ్తాడా? తమిళనాడులో జాతీయ పార్టీలను పట్టించుకోని నేపధ్యంలో రజనీ అలాంటి స్టెప్ తీసుకుంటాడా? లేక సొంతగా పార్టీ పెట్టి ఎన్నికల తర్వాత ఎన్డీయేలో భాగస్వామి అవుతాడా? అనేది ఆసక్తికర విషయం.