తెలుగులో ఎలాంటి వివాదాల జోలికి పోకుండా, సాటికళాకారులు చిన్నవారైనా పెద్ద వాళైనా వారితో కలసి పోయి నటించే స్టార్స్‌గా మనకు పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబులను చెప్పుకోవచ్చు. ఇక పవన్ అయినా ఆయన పెళ్లిళ్ల వంటి విషయాలలో, ఇంకా రాజకీయాలలోకి వచ్చిన తర్వాత అయినా కాస్త వివాదం అయ్యాడు గానీ మహేష్ పర్సనల్‌లైఫ్‌లో కూడా ఎలాంటి వివాదాలు లేవు. ఇక తెలుగులో వారిద్దరిలాగానే సూపర్‌స్టార్ రజనీకాంత్, తలైవా అజిత్‌లను చెప్పుకోవచ్చు. వారు కూడా దాదాపు అజాతశత్రువులే.
ఇక వీరిద్దరి గురించి తాజాగా నయనతార చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. ఆమె రజనీకాంత్‌తో తన కెరీర్ ప్రారంభంలోనే 'చంద్రముఖి', 'కుశేలన్'లలో నటించింది. ఇక అజిత్‌తో మూడు చిత్రాలు చేసింది. వారి గురించి నయనతార మాట్లాడుతూ, నాకు అజిత్‌గారితో నటించడమంటే ఎంతో ఇష్టం. ఆయనతో 'బిల్లా' చిత్రం చేసేటప్పుడు నేనేమీ నటనలో పెద్ద అనుభవం ఉన్నదానిని కాదు. స్థాయి కూడా తక్కువే. కానీ అజిత్‌సార్ మాత్రం తాను ఓ స్టార్ అన్నట్లుగా బిహేవ్ చేయకుండా నాకు ఎంతో ప్రోత్సాహం అందించారు. రజనీ, అజిత్‌లు సహనటీనటులను, ముఖ్యంగా మహిళలను ఎంతో గౌరవిస్తారు. స్త్రీలను గౌరవించడంలో వారికి వారే సాటి.. అందుకే వారు స్టార్స్‌గా వెలుగొందుతున్నారని చెప్పింది.
ఇక నయనతార దాదాపు 35ఏళ్లకు వస్తున్నా కూడా తమిళంలో ఆమెకున్న క్రేజ్ తగ్గకపోగా వయసు పెరిగే కొద్ది కొత్త స్టార్స్, కొత్తగా ఇండస్ట్రీకి పరిచయమయ్యే వారు కూడా ఆమె తమ సినిమాలో నటిస్తే చాలు... ఆమె తమ చిత్రంలో నటిస్తే ఓపెనింగ్స్ నయనతారను చూసే వస్తాయనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇంత లాంగ్ కెరీర్ నాటి శ్రీదేవి, జయప్రద, జయసుధ, సౌందర్య, భానుప్రియ వంటి వారి తర్వాత ఈమెకే సాధ్యమైందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఆమెతో లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేయడానికి కూడా ముమ్మర ప్రయత్నాలను దర్శకనిర్మాతలు చేస్తున్నారు.
స్వతహాగా నయనతార తాను పర్‌ఫెక్ట్‌గా నటించిందా? లేదా? అన్న విషయాలను తప్పించి ప్రమోషన్లు, ప్రెస్‌మీట్లలో కూడా కనిపించదు. సినిమా బాగుంటే చూస్తారని బాగా లేకపోతే ఎంతగా ప్రమోషన్ చేసినా ఉపయోగం లేదనేది ఆమె సిద్దాంతం. కానీ ఎంతకీ నిర్మాతలు వదలకపోవడంతో ఆమె ప్రమోషన్లలో పాల్గొనాలంటే మరింత ఎక్కువ పారితోషికంగా డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. కానీ ఈమె నటించిన 'ఆరమ్' అనే లేడీ ఓరియంటెడ్ చిత్రం దీపావళికి రానుంది. ఈ చిత్రానికి మాత్రం ఆమె విపరీతంగా ప్రమోషన్లు చేస్తోంది. దానికి కారణం ఆ చిత్రం రహస్య నిర్మాత నయనతారేనంటున్నారు. ఈ ప్రమోషన్‌లో భాగంగానే ఆమె రజనీ, అజిత్‌ల గురించి ప్రత్యేకంగా ఓ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.