తమిళంలో రజనీ కాంత్, అజిత్‌ల తర్వాత ఆ స్థాయి స్టార్‌డమ్ ఉన్న స్టార్ విజయ్. కాగా ఆయన ప్రస్తుతం రాజా-రాణి ఫేమ్ అట్లీ దర్శకత్వంలో 'మెర్సిల్' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం టీజర్ ఇటీవల తమిళంలో విడుదలైంది. ఈ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే ఈచిత్రంలో కాజల్ అగర్వాల్, సమంతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం స్క్రిప్ట్‌ను 'బాహుబలి, భజరంగీ భాయిజాన్'ల రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందిస్తుండటం మరింత విశేషం.
ఈ చిత్రం తెలుగు టైటిల్‌ను 'అదిరింది'గా ఫిక్స్ చేశారు. తాజాగా చిత్రం తెలుగు టీజర్‌ని కూడా తమిళంలో ఉన్నది ఉన్నట్లుగా చూపించారు. ఇక ఈ చిత్రం తమిళ వెర్షన్‌లో విజయ్ ఎంజీఆర్‌కి వీరాభిమానిగా కనిపిస్తాడు. దీనికి సంబంధించి తమిళ టీజర్‌లో బ్యాగ్రౌండ్‌లో ఎమ్జీఆర్ కటౌట్లను చూపించారు. తెలుగుకి వచ్చేసరికి టీజర్‌లో ఎన్టీఆర్ నటించిన 'అడవిరాముడు' చిత్రంలోని కటౌట్స్‌ని చూపించారు. ఇక విజయ్ ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం పోషిస్తున్నాడని సమాచారం.
ఇక విజయ్ కంటే తమిళంలో తక్కువ ఫాలోయింగ్ ఉన్న నటులు కూడా తెలుగులో మార్కెట్‌ని సంపాదించుకుంటున్నారు. కానీ విజయ్ మాత్రం 'తుపాకి, జిల్లా' ల తర్వాత 'పులి, పోలీస్' చిత్రాలతో ఉన్న పేరును కూడా చెడగొట్టుకున్నాడు. మరి ఈ 'అదిరింది' చిత్రమైనా తెలుగులో విజయ్‌కి మంచి హిట్టును అందిస్తుందో లేదో వేచిచూడాల్సివుంది. ఈ చిత్రం దీపావళి కానుకగా తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.