ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర ఏడాది వరకు సమయం ఉన్నా కేంద్రంలోని బిజెపి ఇప్పటినుంచే ఎన్నికల ప్రణాళికలు రచిస్తోంది. వీలైతే జమలి ఎన్నికలు, లేకపోతే సార్వత్రిక ఎన్నికలకు కూడా సిద్దమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాలలోని పార్టీలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలోని టిడిపి, జగన్ నేతృత్వంలోని వైసీపీలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీ అంటున్నాయి. జగన్ పాదయాత్రకు సిద్దం కాగా, టిడిపి ఇంటింటి ప్రచారం ముమ్మరం చేసింది. రోజులు గడిచే కొద్ది వచ్చే ఎన్నికలలో బిజెపి, టిడిపిల పొత్తు మరలా ఉంటుందా? లేదా? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
గతంలోలాగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మంత్రిగానే పదవిలో ఉండి ఉంటే ఈ విషయంపై ఇప్పటికే ఆయన లీక్‌ల వల్ల పరిస్థితి తేటతెల్లమయ్యేది. కానీ ఇప్పుడు ఆ విషయంలో ఇంకా టీడీపికి క్లారిటీ రావడం లేదు. బిజెపి టిడిపితోనే పొత్తుకు ఒప్పుకుంటుందా? లేదా ఒంటరిగా పోటీకి సై అంటుందా? అనేది తెలియరావడం లేదు. ఎందుకంటే వారు ఏపీలో బలపడాలని భావిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన నాయకులు కూడా సొంతగా పోటీ చేయాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. అదే జరిగితే బిజెపి మరలా ఎన్నికల్లో మెజార్టీ తక్కువైన నేపధ్యంలో వైసీపీ సహాయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇక బిజెపి అధిష్టానం మాత్రం చంద్రబాబు ప్రోద్భలంతోనే పవన్ కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నాడని అనుమానిస్తోంది.
పవన్ వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున టిడిపికి మద్దతు ఇస్తే మాత్రం బిజెపికి, టిడిపి పొత్తు ఉండదనే చెప్పాలి. ఇక ఇటీవల పవన్, తన మంత్రులు, నాయకుల చేత చంద్రబాబు కేంద్రంపై బాగానే విమర్శలు చేయిస్తున్నారు. తాజాగా ఆయనే ఒక అడుగు ముందుకేసి ప్రత్యేకహోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా నిధులు ఇవ్వడంలో కేంద్రం అలసత్వం వహిస్తోందని వ్యాఖ్యానించాడు. రెవిన్యూ లోటు, పోలవరం నిధులు, ప్రత్యేక రైల్వేజోన్ విషయంపై కూడా చంద్రబాబు కాస్తింత బిజెపిపై వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు. దీన్నిబట్టి వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు-పవన్‌లు కలిసి కేంద్రం సహాయం చేయకపోతే ఇబ్బంది కాబట్టి మౌనం వహించామని, నిజానికి బిజెపియే దోషి అని ప్రచారం చేసి ఏపీ ప్రజల్లో బిజెపి మీద ఉన్న ఆగ్రహాన్ని క్యాష్ చేసుకునే పరిస్థితి ఉంది.