స్పైడర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గత బుధవారమే విడుదలైంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం తెలుగులో నెగెటివ్ టాక్ తెచ్చుకోగా... తమిళంలో మాత్రం మిశ్రమ స్పందనతో రన్ అవుతుండగా... మలయాళంలో మాత్రం మురుగదాస్ - మహేష్ బాబు కలయికలో వచ్చిన స్పైడర్ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. స్పైడర్ సినిమా కేరళలో విడుదలైన మొదటిరోజే 85లక్షల రూపాయల వసూళ్లు రాబట్టింది. సినిమా కూడా మంచి టాక్ తో రన్ అవడంతో వసూళ్లు కూడా బావుంటాయని అనుకునే లోపే... జైల్లో శిక్ష అనుభవిస్తున్న దిలీప్ సినిమా రామలీల విడుదలవడంతో స్పైడర్ కి దెబ్బపడేలా వుంది అంటున్నారు.
హీరోయిన్ కిడ్నాప్ కేసులో జైలులో శిక్ష అనుభవిస్తున్న దిలీప్ జైలుకెళ్ళకముందు నటించిన రామలీల సినిమా ఎట్టకేలకు థియేటర్స్ లోకి వచ్చింది. ఆ సినిమా దిలీప్ జైలుకెళ్లే నాటికీ పూర్తి కాకపోయినా కొన్ని మెరుగులు దిద్ది చివరికి నిర్మాతలు ఈ సినిమాని విడుదల చేశారు. అయితే ఆ సినిమాలో దిలీప్ ఇప్పుడు అనుభవిస్తున్న జైలు జీవితంలాంటి సన్నివేశాలు ఉండడంతో కేరళ ప్రేక్షకులు ఇంకా ఆ సినిమాలో ఏం చూపించారో అనే క్యూరియాసిటీతో ఆ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఆ ఆసక్తితోనే మంచి టాక్ తెచ్చుకున్న స్పైడర్ ని పక్కన పెట్టేసి రామలీల మీద ఇంట్రెస్ట్ చూపడంతోనే స్పైడర్ కి దెబ్బపడింది అంటున్నారు.
లేకుంటే స్పైడర్ సినిమా మలయాళంలో మంచి టాక్ తెచ్చుకుంది కాబట్టి సినిమా అక్కడ హిట్ అయ్యేదే అంటున్నారు. అందులోను ప్రస్తుతానికి అక్కడ మలయాళంలో పెద్ద సినిమాలేమి లేకపోవడం కూడా స్పైడర్ కి కలిసొచ్చేదని.... కానీ దిలీప్ వలన మహేష్ ఇరుకున పడాల్సి వచ్చిందని అంటున్నారు.