ప్రస్తుతం రివ్యూలు, విశ్లేషకులపై సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చే నడుస్తోంది. చిత్రాలకు బ్యాడ్ రివ్యూలు ఇస్తున్నారని, వారు దారిన పోయే దానయ్యలతో ఎన్టీఆర్ పోల్చాడు. సరే ప్రింట్‌మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాని సరైన రివ్యూలు ఇవ్వకుండా మన దర్శకనిర్మాతలు, హీరోలు బాగానే మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. కానీ సోషల్‌మీడియాను మాత్రం వారు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఒకప్పుడు తెలుగు సినీ జర్నలిజం చూస్తే జాలి వేసేది. బాగాలేని చిత్రాలను కూడా బాగుందని రాసి, చానెల్స్‌లో అది చూపితేనే పత్రికలు, చానెల్స్ ఆధారపడే ప్రకటనలు ఇస్తామని తెలుగు ఇండస్ట్రీ వారందరూ ఓ విధమైన బ్లాక్‌మెయిల్ చేశారు. ఏమాత్రం తేడా వచ్చినా ప్రకటనలు ఆగిపోతాయి. దాంతో సినిమా వారిది ఒంటెద్దు పోకడ అయింది.
కానీ సోషల్ మీడియా విస్తృతమైన నేపథ్యంలో వారు సోషల్ మీడియాను కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇక మహేష్‌బాబు 'స్పైడర్' రివ్యూల విషయంలోనే కాదు... గతంలో ఆయన నటించిన 'బ్రహ్మోత్సవం, ఆగడు' రివ్యూలు చూసి కూడా మౌనం వహించాడు. ఇక రివ్యూలే కాదు.. చివరకు సినిమా విడుదలకు ముందే లీకయిపోయినా ఇండస్ట్రీ హిట్ కొట్టవచ్చని పవన్ 'అత్తారింటికి దారేది' ద్వారా నిరూపించాడు. ఆయన కూడా తన సినిమాల రివ్యూలలో పెద్దగా జోక్యం చేసుకోడు. కాకపోతే జనాలు ఈ మద్యనా చిత్రాలు ఎక్కువగా చూడటం లేదు. నాకు కూడా నాలుగు పైసలు డబ్బులు రావాలి కదా.. అని స్పోర్టివ్‌గా తనపై తాను కామెంట్ వేసుకున్నాడు. ఇక 'జనతాగ్యారేజ్' చిత్రం విషయంలోనే కాదు.. నాడు మహేష్‌బాబు 'పోకిరి' విషయంలో కూడా పెద్ద గొప్పగా రివ్యూలు రాలేదు. కానీ చిత్రాలు ఇండస్ట్రీ హిట్టులని కొట్టాయి. మరి ఆ విషయం మర్చిపోయి ఎన్టీఆర్ ఏదేదో మాట్లాడుతున్నాడు.
ఇక తాజాగా సినీ ఇండస్ట్రీ పెద్దగా, దర్శకునిగా, నిర్మాతగా వున్న తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, సినీ విశ్లేషకులు విశ్లేషణలు చేస్తూనే ఉంటారు. మనం వద్దని చెప్పినా చేస్తారు. చేయనివ్వండి.. ఇండస్ట్రీకి గానీ సినిమాలకు గానీ దాని వల్ల వచ్చే నష్టం లేదు. వారితో పరస్పరం కలిసి ఉంటాం కాబట్టి రాయవద్దని కోరుతున్నాం...లేదంటే ఓకే.. వెల్ అండ్ గుడ్...సినిమాలో దమ్ముంటే దానిని ఎవ్వడూ ఆపలేడు. వాళ్లు హిట్ అన్నా, ఫట్ అన్నా ఆడే సినిమా ఆడుతుంది. ఈ విషయం గురించి అనవసర చర్చలు అనవసరం అని తేల్చిపారేశాడు. ఇక రివ్యూల ప్రభావం లేకపోతే ఇండస్ట్రీ వారు వారి పనులు, విశ్లేషకులు తమ పని హాయిగా చూసుకునే వీలుంటుంది.
గతంలో కొన్ని వాస్తవాలు రాశారని కొందరు జర్నలిస్ట్‌లు, పత్రికాధిపతుల మీద బహిష్కరణ వేటు వేసి ఇండస్ట్రీ మీడియాను నానా తిప్పలు పెట్టినరోజున ఈ పెద్దాయన తమ్మారెడ్డి భరద్వాజ నోరేమైపోయింది? సరే వెబ్‌సైట్లు రివ్యూలు రాయకున్నా ఆ సినిమా చేసిన ప్రేక్షకులు, వారి వెలిబుచ్చుతున్న అభిప్రాయాలను ఎలా ఆపగలరో తమ్మారెడ్డిగారు చెప్పాలి. ఇక ఆయన నిర్మాతగా, దర్శకత్వం వహించిన చిత్రాలలోఒకటి రెండు తప్ప అన్ని ఫెయిల్యూర్స్‌గానే నిలిచాయి. నాడు మరీ సోషల్‌మీడియా ఇంతగా విస్తృతం లేదు కదా...! లేకపోతే తన ఆడని సినిమాలకు కూడా ఆయన రివ్యూలే కారణమంటాడేమో సుమా...!