జబర్దస్త్ వచ్చాక టాలీవుడ్ కి కమెడియన్స్ కొరత లేకుండా పోయింది. ఒక సినిమాలో తీసుకున్న కమెడియన్ ని మరొక సినిమాలో తీసుకోకుండా ఎప్పటికప్పుడు కమెడియన్స్ మార్పులు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఒక సినిమాలో మంచి నేమ్ వచ్చిన కమెడియన్స్ కి మాత్రమే తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. అలాంటి వారిలో వెన్నెల కిషోర్, షకలక శంకర్ లాంటివారు ఉన్నారు. ఇక ఫ్రెండ్స్ పాత్రల్లో కొంతమంది అంటే ప్రవీణ్ వంటి వారు హీరోల పక్కనే ఫ్రెండ్స్ కేరెక్టర్స్ లోనే కామెడీ చేసేస్తున్నారు. అయితే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు సినిమాలో కమెడియన్ గా పరిచయమైనా ప్రియదర్శి ఆ సినిమాలో కామెడీ టైమింగ్ తో, భాష యాసతో ఇరగ్గొట్టేశాడు.
ఆ సినిమాతో ప్రియదర్శి ఒక్కసారిగా స్టార్ కమెడియన్ అయ్యాడు. ఆ నేమ్ తోనే భారీ బడ్జెట్ సినిమాల్లో అవకాశాలు కొట్టేశాడు. ఎన్టీఆర్ జై లవ కుశలో అవకాశం కొట్టేసిన ప్రియదర్శి ఆ సినిమాలో మంచి కామెడీతో ఆకట్టుకున్నప్పటికీ... ఆసినిమాలో ప్రియదర్శి పాత్రకి నిడివి తక్కువ ఉండడంతో పెద్దగా హైలెట్ కాలేకపోయాడు. కేవలం రాశి ఖన్నాని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన కుర్రాడి పాత్రలో ప్రియదర్శి కామెడీ డైలాగ్స్ పేలినా... ఆ తర్వాత రాశి ఖన్నా చేతిలో బకరా అయ్యే పాత్రలో నటించాడు. అలాగే మరో భారీ చిత్రం స్పైడర్ లోనూ... మహేష్ కి ఫ్రెండ్ పాత్రలో నటించాడు.
స్పైడర్ చిత్రం ఆధ్యంతం మహేష్ కి స్నేహితుడిగా కనబడినప్పటికీ... ఈ సినిమాలో ప్రియదర్శి కామెడీతో ఆకట్టుకోలేకపోగా... అసలు పెద్దగా ప్రత్యేకత లేకుండా పోయింది అతని పాత్ర. మరి కెరీర్ ఆరంభంలోనే స్టార్ హీరోల సినిమాలో మంచి అవకాశాలు కొట్టేసిన ప్రియదర్శికి మాత్రం ఆ భారీ అవకాశాల వలన పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. పాపం పూర్ ప్రియదర్శి.