తెలుగు సినిమా ఇండస్ట్రీలో వేగంగా సినిమాలను తెరకెక్కించే దర్శకుడు ఎవరు అని అడగ్గానే అందరు టక్కున పూరి జగన్నాధ్ అని చెప్పేస్తారు. ఎందుకంటే పూరి ఆ రేంజ్ లో ఒక్కో సినిమాని పూర్తి చేస్తాడు. తాజాగా పైసా వసూల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూరి జగన్నాధ్... ఆ సినిమా టాక్ తో కాస్త డీలా పడ్డాడు. అయితే బాలకృష్ణ మాత్రం పూరి జగన్నాధ్ కి మరోమారు అవకాశం ఇస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. అలాగే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞని కూడా పూరి లాంచ్ చేయబోతున్నట్లుగా.... గత రెండు రోజులుగా సోషల్ మీడియా అంతా హల్చల్ చేస్తుంది.
అయితే ప్రస్తుతం పూరి జగన్నాధ్ తన కొడుకు ఆకాష్ ని హీరోగా లాంచ్ చేసే పనిలో బాగా బిజీగా ఉన్నాడు. అయితే గురువారం తన పుట్టినరోజుని పురస్కరించుకుని పూరి జగన్నాధ్ తన కొడుకుతో తీయబోయే సినిమా టైటిల్ ని సోషల్ మీడియాలో ప్రకటించాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఆకాష్ హీరోగా నటించబోయే సినిమాకి 'మెహబూబా' అనే టైటిల్ ని ఖరారు చేశాడు పూరి. అయితే ఈ సినిమా గురించిన పూర్తి వివరాలను కూడా మీడియాలో పోస్ట్ చేసాడు. 'మెహబూబా' సినిమా గురించి పూరి వివరిస్తూ..... ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం పూర్తయిందని..... ఇదొక ఇంటెన్స్ ప్రేమ కథ అని చెప్పిన పూరి..... 1971 ఇండియా - పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో సాగే సినిమా అని చెప్పాడు.
ఇంకా పూరి జగన్నాధ్ ఏం చెప్పాడంటే... ఈ సినిమా నా తరహా సినిమాలకి పూర్తి భిన్నమైంది అని కూడా చెప్పాడు. ఇంకా పూరి జగన్నాధ్ నా కొడుకు ఆకాష్ కి సినిమాల పట్ల ఉన్న తపనే నా చేత ఈ సినిమాను చేయిస్తోంది... అని అలాగే ఈ సినిమాలో ఆకాష్ కి జోడిగా నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది అని అధికారిక ప్రకటన చేశాడు. మరి వరుస ప్లాప్స్ తో ఉన్న పూరి తన కొడుకు సినిమాతోనైనా హిట్ అందుకుంటాడేమో చూద్దాం.