ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినిమా రివ్యూలపై పెద్ద చర్చ, రచ్చ జరుగుతోంది. ఆమధ్య 'డిజె' (దువ్వాడ జగన్నాథం) విషయంలో వచ్చిన నెగటివ్ రివ్యూలపై అల్లుఅర్జున్, దిల్‌రాజు, హరీష్‌శంకర్‌లు మండిపడ్డారు. ఇక తమిళంలో విశాల్ తాను నటించిన 'తుప్పారివాలన్' రివ్యూలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోవైపు గురువారం రిలీజైన ఎన్టీఆర్ 'జై లవకుశ' చిత్రం రివ్యూలలో మిశ్రమ స్పందన వస్తుండటంపై ఎన్టీఆర్ ఏవేవో ఉపమానాలు చెప్పి విశ్లేషకులను దారిన పోయే దానయ్యలపై పోల్చారు. పోయి పోయి సినిమాలను ఐసియులో చావుబతుకుల మద్య కొట్టాడే మనిషితో పోల్చాడు. డాక్లర్లేమో ప్రేక్షకులంట.. విశ్లేషకులు దారిన పోయే దానయ్యలంట.
అయినా ఓ మిత్రుడు చెప్పినట్లు దారినపోయే దానయ్యల మాటలకే పేషెంట్ బతుకుతాడా? చస్తాడా? అనేది తెలిస్తే.. ఆ రోగం ఏదో మామూలు రోగమై ఉండదు. ఎవ్వరికీ అంతుచిక్కని రొటీన్ ఫార్ములా అనే చచ్చిచెడే రోగమే అయి ఉంటుంది. కొత్త సినిమాను ఓ కొత్తగా పెళ్లైన జంట వంటిది. పెళ్లికి వచ్చే బంధువులు, శ్రేయోభిలాషులు సినిమాని చూసే ప్రేక్షకులు, విశ్లేషకులు. పెళ్లి జరిగిన ప్రతి జంట మీద అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు. కొందరికి ఆ జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా అనిపిస్తే, మరికొందరికి ఆ జంట నచ్చదు. దమ్ముంటే జంట నచ్చని వారి అభిప్రాయాలను బేఖాతరు చేసి జంట అన్యోన్యంగా నూరేళ్ల కాపురం చేయాలే గానీ, జంట బాగాలేదు అని అభిప్రాయపడే వారి మాటలకు అంత విలువు ఎందుకు ఇస్తున్నారు?
అసలు విశ్లేషకులు ఏ విలువ లేని దారిన పోయే దానయ్యలైతే వారి మాటలకు ఎందుకు అంత పనిగట్టుకుని మరలా మరలా మాట్లాడాల్సివస్తుంది? ఈ సినిమాలు తీస్తున్న వాళ్లంతా మూసగొట్టు ధోరణిలో ఉండి, తాము తీసే సినిమాల పట్ల తమకే నమ్మకం లేని భావదారిద్య్రంలో, అభద్రతా భావంలో ఉన్నారని చెప్పవచ్చు. రివ్యూలను చూసి సినిమాలు చూసే ప్రేక్షకులు ఉండరని, అసలు రివ్యూలకు వాల్యూనే లేదని చెప్పేవారికి మంచి రివ్యూ ఇచ్చినా? నెగటివ్ రివ్యూ ఇచ్చినా వచ్చిన నష్టం ఏమిటి? అసలు రివ్యూలు ఎలాంటి ప్రభావం చూపవని భావించే వారు పనిగట్టుకుని ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సివస్తోంది?
ఇక మహేష్ మాత్రం రివ్యూల విషయంలో ఖచ్చితమైన అభిప్రాయంతో ఉన్నాడు. సినిమా బాగుంటే బాగుందని రాస్తారు.. బాగా లేకపోతే బాగా లేదని రాస్తారు.. నేను కూడా రివ్యూలు చదువుతానని తేల్చిచెప్పాడు. అంతేకాదు.. ఆయన తన అభిమానులు గొప్పవారని, ఎందుకంటే సినిమా బాగుంటేనే తన అభిమానులు కూడా చూస్తారని, బాగా లేని చిత్రాన్ని తన అభిమానులు కూడా చూడరని బేషరత్తుగా ఒప్పుకున్నాడు. ఎందుకంటే రివ్యూలు బ్యాడ్‌గా వచ్చిన చిత్రాలన్నీ మహేష్ విషయంలో జనాదరణ కూడా పొందలేదు కాబట్టి ఆయన జెన్యూన్‌గా తన అభిప్రాయం చెప్పాడు.
ఇక తెలుగులో మూసగొట్టుడు చిత్రాలతో ఇప్పటివరకు ఒకటి అరా తప్ప ఎలాంటి హిట్స్‌లేని మంచు విష్ణు తాజాగా రివ్యూలపై స్పందించాడు. ఆయన అసలు సినిమాలు చూడకుండానే రివ్యూలు రాస్తున్నారని, మనసు పెట్టి సినిమాను చూడకుండా అప్‌డేట్స్ ఇస్తున్నారని, శ్రద్దగా, ఏకాగ్రతగా చూస్తే సినిమాపై మరింత స్పష్టమైన అభిప్రాయం వస్తుందన్నాడు. సినిమాను చూస్తూ అసలు ఎటువంటి అప్‌డేట్స్‌ను ఇవ్వరాదని సూచించాడు. బాధ్యత ఉన్నవారెవ్వరూ ఆ పని చేయరని, తాము ఎంతో కష్టపడి సినిమాలు తీస్తుంటే మంచి సమీక్షలు రావడం లేదంటున్నాడు.
అసలు ఆ విషయానికే వస్తే అసలు తెలుగు హీరోలలో 90శాతం మందికి సరైన స్క్రిప్ట్‌ని ఎంచుకోవడం, అసలు స్క్రిప్ట్‌ని చదవి విజన్ చేసుకోవడం రాదని చెప్పాల్సివుంది. సినిమా వారు కష్టపడి సినిమా తీస్తున్నాం.. అయినా మంచి సమీక్షలు రావడం లేదని అంటున్నారు. ప్రేక్షకులు కూడా పెరిగిన సినిమా రేట్లు, ఇతర తినుబండారాలు, డ్రింక్‌లు వంటి వన్నీ కలుపుకుని సినిమా చూద్దామంటే వేలలో ఖర్చవుతోందని, తాము ఆ వెయ్యి రూపాయలను సంపాదించడానికి పడే కష్టం సినిమా తీసే వారికి అర్ధం కావడం లేదని ఆరోపిస్తున్నారు. అందునా పాపం మన మంచు విష్ణు, ఎన్టీఆర్ వంటి హీరోలు పాత్ర చిత్రాల కథలనే కొత్తగా మన దర్శకులు చెబుతుంటే..ఇది పాత కథ కదా..! అనే పరిజ్ఞానం కూడా లేకుండా పాత స్టోరీలను అటు తిప్పి ఇటు తిప్పి చెప్పే రచయితలు, దర్శకులకే అవకాశాలిస్తున్నారని, క్రియేటివ్ డైరెక్టర్లను పట్టించుకోవడం లేదని, కనీసం వారు చెప్పే వినూత్న కథలను జడ్జి చేయడం కూడా హీరోలకు రావడం లేదని తేల్చిచెపాల్సివస్తోంది...!