వేదికలపై మాట్లాడటం అనేది ఓ కళ. గతంలో ఎన్టీఆర్, ఏయన్నార్‌లు వేదికలనెక్కితే అద్భుతమైన స్పీచ్‌లు ఇచ్చేవారు. ఇక ఆ తర్వాత చిరంజీవి ఆ స్థానం సంపాదించాడు. మెగాస్టార్ కూడా మైక్ అందుకుంటే అదరగొట్టేస్తాడు. నాగార్జున వేదికలపై బాగానే మాట్లాడుతాడు. కానీ వెంకటేష్ ప్రేక్షకులకు అర్ధం కాని తెలిగింగ్లీష్‌ను మాట్లాడేస్తాడు. బాలయ్య అయితే ఏదో చెప్పాలని భావించి మరోదే చెబుతూ ఉంటాడు. ఇక మొదట్లో పవన్ ఏదో పొడిపొడిగా, బిడియంగా మాట్లాడేవాడు. కానీ రాజకీయాల పుణ్యమా అని ఆయన తన ప్రసంగ తీరును కూడా బాగా మార్చుకున్నాడు. ఇక రామ్‌చరణ్, అల్లుఅర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు మైక్ దొరికితే చించి ఆరేస్తారు. కానీ తెలుగులో ఇప్పటికీ పెద్దగా ప్రసంగాలు చేయలేని హీరోగా మహేష్‌బాబు, ప్రభాస్‌లను చెప్పుకోవాలి. కానీ మహేష్‌బాబు ఇటీవల వేదికలపై సందర్భానుసారం సెటైర్లు, పంచ్‌లు వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. దానికి తాజాగా జరిగిన 'స్పైడర్' వేడుకలో ఆయన చేసిన ఏడెనిమిది నిమిషాల ప్రసంగాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు.
ఇక ప్రభాస్‌కి కూడా సరిగా వేదికలపైనే కాదు...ప్రెస్‌మీట్లలో కూడా పెద్దగా ప్రసంగించే అలవాటు లేదు. కానీ 'బాహుబలి' సమయంలో బాగా మాట్లాడాడు. అదంతా నేషనల్ మీడియా ముందు మాట్లాడాల్సిన అవసరం ఉండటంతో దాని కోసం ప్రభాస్‌కి జక్కన్న మంచి ట్రైనింగ్ ఇచ్చాడని చెబుతారు. ఇక రాజమౌళి స్పీచ్‌లివ్వడంలో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. ఇక ప్రభాస్ తాజాగా తన ఓన్ బేనర్ వంటి యువిక్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 'మహానుభావుడు' ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చాడు. మైక్ తీసుకుని మరోసారి తన భయాన్ని చూపించాడు.
శర్వానంద్ గురించి ఏమి మాట్లాడాలో మాట్లాడకూడదో అన్నట్లుగా శర్వానంద్ కాబోయే సూపర్‌స్టార్ అనేశాడు. శర్వానంద్ గురించి గొప్పగా చెప్పాలనుకుని, ఏదో చెప్పబోయి చివరకు ఏదో అనేశాడని వేడుకకు హాజరైన వారు గుసగుసలాడుతున్నారు. ఈ వ్యాఖ్యలకు, ముఖ్యంగా తనను కాబోయే సూపర్‌స్టార్ అన్నప్పుడు పక్కనే ఉన్న శర్వానంద్ సైతం బాగా ఇబ్బంది పడినట్లుగా కనిపించింది.