మరికొన్ని గంటల్లో మహేష్‌బాబు 'స్పైడర్' విడుదల కానుంది. ఈ చిత్రంలో రెండు హైగ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ ఉన్న సీన్స్ ఉన్నాయని, టీజర్, ట్రైలర్స్‌లో అవి లేకుండా మురుగదాస్ జాగ్రత్తలు తీసుకుని సాదా సీదాగా టీజర్, ట్రైలర్‌ని కట్ చేశాడనే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లకే కోట్లాది రూపాయలను నిర్మాతలు ఖర్చు చేశారని, సినిమాకి ఈ హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు హైలైట్‌గా నిలుస్తాయని వార్తలు వస్తున్నాయి. ఇక నాటి తరంలో హీరోలు గుర్రపు స్వారీలే కాదు.. కత్తి యుద్దాలు, ఇతర చిన్నచిన్న ఫైటింగ్ సీన్స్‌కి కూడా డూప్‌లను వాడేవారు. కానీ నేటితరం ప్రేక్షకుల్లో అవగాహన బాగా పెరుగుతోంది. చివరకు 'బాహుబలి' వంటి హై టెక్నాలజీ ఉన్న చిత్రంలో కూడా ప్రభాస్‌కి డూప్‌గా నటించింది ఎవరు? అనేది అందరికీ తెలిసిపోయింది. ఆ డూప్ హీరోగా ఇటీవల ఓ చిత్రం కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఇక నేటితరం స్టార్స్‌లో రియాల్టీ కోసం ఎంతకైనా తెగించి, ప్రేక్షకులు అద్భుతమైన అనుభూతి పొందేలా ఎంతటి రిస్క్ సీన్ అయినా ఒరిజినల్‌గా చేయాలని తపించే స్టార్స్‌లో సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఒకడు. ఇక ఆయన నటిస్తున్న 'స్పైడర్' చిత్రంలో రోలర్ కోస్టర్‌పై చిత్రీకరించిన యాక్షన్ సీన్ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. ఈ విషయాన్ని చాలా కాలం కిందట ఈ చిత్రంలో నటిస్తున్న యువ విలన్ భరత్ చెప్పుకొచ్చాడు. ఈ సీన్స్‌ని దాదాపు 25రోజుల వరకు చిత్రీకరించారట. ఈ రోలర్‌కోస్టర్ యాక్షన్ సీన్స్ గురించి సినిమాటోగ్రాఫర్ సంతోష్‌శివన్ తాజాగా చెప్పుకొచ్చాడు.
వాస్తవానికి రోలర్ కోస్టర్‌పై ఎలాంటి సన్నివేశం తీయాలన్నా ఎంతో రిస్క్‌తో కూడిన విషయం. అది కూడా హైయాక్షన్ సీన్ అనేసరికి మరింత కష్టమైంది. ఇందుకోసం హై ఎండ్ కెమెరాలను ఉపయోగించాం. మహేష్, భరత్‌లు పాల్గొన్న ఈ సీన్స్ ఎంతో రిస్క్‌తో కూడుకున్నవి. ఎన్ని సేఫ్టీ పద్దతులు తీసుకున్నా కూడా ప్రాణాలతో చెలగాటమేనని చెప్పాలి. నేనే కనుక ఆ స్థానంలో ఉంటే చేసి ఉండేవాడిని కాదు.. నమస్తే బ్రదర్ అని వచ్చేసే వాడిని. అంత రిస్క్‌తో కూడుకున్న షాట్స్ ఇవి అని చెప్పకొచ్చాడు. దాంతో 'స్పైడర్' చిత్రంలో ఉండే రెండు మూడు గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్‌ల సీన్స్‌తో పాటు ఈ రోలర్‌కోస్టర్ సీన్స్ కూడా ప్రధాన హైలైట్ అవుతాయని మహేష్ అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు.