ఈ మధ్య ఏదో సినిమాలు చేసేసి స్టార్స్ అయిపోయి, ఏదో దర్శకుల పుణ్యాన్నో లేక వారసత్వం పుణ్యానో ఉనికిలో ఉంటున్న స్టార్స్ కూడా విశ్లేషకులపై ఇంత ఎత్తున లేస్తున్నారు. అల్లుఅర్జున్, దిల్‌రాజు, హరీష్‌శంకర్‌లు 'డిజె' సమయంలో విశ్లేషకులపై ఎలా విరుచుకుపడి చివరకు ఓటమిని ఒప్పుకోక తప్పని విధంగా తుది కలెక్షన్ల చిట్టా వచ్చే సరికి మౌనంగా ఉండిపోయారు. ఓవర్‌సీస్‌లో ఈ సినిమా ఆపరేషన్ చేసి బెడ్ మీద ఉన్న చావు బతుకుల మద్య పోరాడుతున్న పేషెంట్‌లా ఉందని విశ్లేషకులు చెబితే ఒంటి కాలిపై లేచారు. కానీ ఫలితం.. సినిమా ఎలా ఉంది..? అనేవి ఆ సినిమాలను చూసిన తటస్థ ప్రేక్షకుడిని అడిగినా చెప్తారు. అసలు నేటిరోజుల్లో స్టార్స్ అన్ని రకాల ప్రేక్షకుల మెప్పును పొందేలా సినిమాలు చేస్తున్నారా? లేక కేవలం తమ అభిమానులను మెప్పిస్తే చాలని భావిస్తున్నారా? అంటే ఖచ్చితంగా తమ అభిమానుల కోసమే తప్ప సగటు సినీ ప్రేక్షకుడి అభిరుచిని పట్టించుకోవడం లేదన్నది నగ్నసత్యం.
ఇక ఎన్టీఆర్ కూడా తాజాగా 'జైలవకుశ' సక్సెస్ మీట్‌లో విశ్లేషకుల మీద దారుణమైన చురకలు అంటించాడు. వాక్చాతుర్యం చాలా మందిలో ఉంటుంది. విశ్లేషకుల్లో కూడా ఎంతో ఉంటుంది. మరి ఎన్టీఆర్ ప్రతి చురకకి తగ్గ సెటైర్ విశ్లేషకుల వద్ద కూడ ఉన్నాయని చెప్పవచ్చు. బాగా లేని సినిమాను బాగా ఉందని భజన చేయాలా? నేను మారిపోయాను.. ఒకప్పటి ఎన్టీఆర్‌ని కాదు.. అని ఆయన చెబుతుంటే ఆయనలో నిజమైన మార్పు వచ్చిందని, విమర్శలను తట్టుకునే మనస్తత్వం, నిజాన్ని నిజాయితీగా ఒప్పుకునే తత్వం వచ్చాయని చాలా మంది సంతోషించారు. కానీ ఎన్టీఆర్ మారలేదని తాజా ప్రసంగం వింటే అర్ధమవుతుంది.
విశ్లేషకులను మీరు ఏ అర్హతలతో రివ్యూలు రాస్తున్నారని నటీనటులు ప్రశ్నించడం మామూలైపోయింది. మరి ఏ అర్హతలతో ఈ సోకాల్డ్ స్టార్స్ సినిమాలలోకి ఎంటర్ అయ్యారో చెప్పగలరా? డాక్టర్ కంటే పోస్ట్‌మార్టమ్ చేసే నిపుణుడికే పేషెంట్ ఎందుకు చనిపోయాడు అనేది ఎక్కువగా అవగాహన ఉంటుంది. ప్లాన్ గీసే డిజైనర్ కంటే ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న ముఠామేస్త్రికి మాత్రమే బిల్డింగ్‌కి ఎంత సిమెంట్, ఇతర వస్తువులు ఏమేమి అవసరమో స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఎంతో అనుభవం ఉన్న డాక్టర్ల కంటే ఒక సుదీర్ఘ వ్యాధితో ఎన్నో ఏళ్ల నుంచి బాధపడుతున్న పేషెంట్‌కే ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. అసలు ఎన్టీఆర్ 'జై లవకుశ' చిత్రంలో జైగా ఎన్టీఆర్ నటన తప్ప ఇంక అందులో ఏముందో ఎవరైనా చెప్పగలరా? 'టెంపర్, నాన్నకుప్రేమతో, జనతాగ్యారేజ్'లలో ఎన్టీఆర్ నటనను పొగిడి మంచి రివ్యూలు ఇచ్చినప్పుడు పట్టించుకోని ఎన్టీఆర్ 'జై లవకుశ' విషయంలో మిక్స్‌డ్‌టాక్ ఉన్న విషయాన్ని ఎందుకు కావాలని విస్మరిస్తున్నాడు?
'జై లవకుశ' ద్వారా అభిమానులు తలెత్తుకునేలా చేశానని భావిస్తున్నాను. తల ఎత్తుకునేలా ఈ చిత్రం లేదని అభిమానులు భావిస్తే చెప్పండి....ఈ సినిమా కాకపోతే మరోటి.. అదీ కాకపోతే ఇంకోటి....ఇలా అభిమానుల కోసం ప్రయత్నిస్తూనే ఉంటానని చెప్పడం ద్వారా 'జైలవకుశ' కేవలం ఎన్టీఆర్ అభిమానులను మాత్రమే ఉద్దేశించి చేసిన సినిమా అని ఎన్టీఆర్ మాటల ద్వారానే తేలింది. కొత్తగా విడుదలైన చిత్రం ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్ వంటిదని, ప్రేక్షకులు డాక్టర్లు అని, దారిన పోయే దానయ్యలు విశ్లేషకులని ఎన్టీఆర్ తేల్చాడు. మరి దారిన పోయే దానయ్యలను వదిలేస్తే వారి మానాన వారు పోతారు... మరలా మరలా వారినే తల్చుకుని, వారి రివ్యూలను చూసి బాధ పడుతూ ఉండటం ఎందుకు తారక్? నీ దగ్గర సమాధానం ఉందా...? సినిమాని సినిమాగా చూడాలని మీరనుకుంటూ ఉంటే రివ్యూని రివ్యూలాగా చదవాలని విశ్లేషకులు అంటున్నారు. ఖేల్ ఖతం....!