సూపర్ స్టార్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం కోసం అటు చెన్నై, ఇటు హైదరాబాద్ మద్య ప్రమోషన్‌లో భాగంగా చాలా బిజీగా ఉన్నాడు. తాజాగా చెన్నైలో ప్రెస్‌మీట్ పెడితే ఓ విలేకరి మహేష్‌కు షాకింగ్ క్వశ్చన్ వేశాడు. తమిళంలో 'రమణ' చిత్రాన్ని మురుగదాస్ దర్శకత్వం వహించగా హీరోగా విజయ్‌కాంత్ నటించాడు. ఈ చిత్రం విడుదలైన తర్వాత విజయ్‌కాంత్ రాజకీయాలలోకి వచ్చాడు. ఇక మురుగదాస్ తెలుగులో 'స్టాలిన్' చిత్రానికి దర్శకత్వం వహించాడు.
దీని తర్వాత చిరంజీవి కూడా రాజకీయాలలోకి వచ్చాడు. ఇక ఇప్పుడు మీరు మురుగదాస్ చిత్రంలో నటించారు కదా...! మరి మీరు కూడా రాజకీయాలలోకి వస్తారా? అని ఆ విలేకరి ప్రశ్నించే సరికి మహేష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నాకు రాజకీయాలలో ఓనమాలు, స్పెల్లింగ్ కూడా రాదని చెప్పేశాడు. ఇక తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడుతూ, 'వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎంతో అద్భుతమైన వ్యక్తి' అని చెప్పాడు. రాజకీయాలను పక్కనపెడితే నేనే ఆయన్ను ఓసారి కలిశాను. మానాన్నగారికి ఆయన చాలా క్లోజ్, నేను కలిసినప్పుడు పక్కన జగన్‌గారు కూడా ఉన్నారు. రాజశేఖర్‌రెడ్డి ఓ అద్భుతమైన వ్యక్తి అని మహేష్ తెలిపాడు.
తనకు రాజకీయాలు తెలియవని, వాటిల్లోకి రానని ఆయన మరోసారి స్పష్టం చేశారు. 'దూకుడు' చిత్రంలో రాజకీయనాయకుడిగా నటించారు కదా...! నిజ జీవితంలో కూడా రాజకీయాలలోకి రావచ్చు కదా...! అని అడిగితే తనకు నటించడం మాత్రమే తెలుసునని ఆయన మరోసారి తనకు రాజకీయాలలోకి వచ్చే ఆలోచన గానీ ఏదైనా రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చే సమస్య గానీ లేదని మరోసారి తేల్చిచెప్పాడు.