టాలీవుడ్ లో బ్రహ్మనందం తర్వాత ఆ రేంజ్ కమెడియన్ ఇప్పటివరకు లేరనుకుంటూనే వున్నారు అందరూ. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఒక కమెడియన్ బ్రహ్మనందం కామెడీని గుర్తుకుతెస్తున్నాడు. రెండే రెండు సినిమాల్తో హైలెట్ అయిన వెన్నెల కిషోర్ కామెడీని ఇప్పుడు తెలుగు ప్రేక్షకులంతా అమితంగా ఇష్టపడుతున్నారు అనడానికి... అమీ తుమీ, ఆనందో బ్రహ్మ సినిమాలే ఉదాహరణ. ఎప్పుడూ ఇలా వచ్చి అలా మాయమయ్యే కమెడియన్ పాత్రల్లో నటించిన వెన్నెల కిషోర్ కి ఇపుడు ఆ రెండు సినిమాల హిట్స్ తో.... సినిమాల్లో ఫుల్ లెన్త్ కమెడియన్ రోల్స్ వస్తున్నాయి.
అందుకే ఇప్పటి సినిమా రచయితలు హీరోకి ఫ్రెండ్ కేరెక్టర్స్ లోనే కామెడీ పండించే మాదిరిగా వెన్నెల కిషోర్ కి పాత్రలను సృష్టించేస్తున్నారట. ఇంతకు ముందు బ్రహ్మి విషయంలోనూ అదే జరిగింది. కొంతమంది దర్శకులు ఓ ప్రత్యేకమైన పాత్రని బ్రహ్మి కోసం రాసేవారు. అయితే ఇప్పుడు వెన్నెల కిషోర్ కోసం అలాంటి పాత్రలే సెట్ చేస్తున్నారట. ఫలితం వెన్నెల కిషోర్ డైరీ ఫుల్ అయ్యిందట. డేట్స్ సరిగా సర్దుబాటు చెయ్యలేక ఇప్పుడు వెన్నెల కిషోర్ సతమతమైపోతున్నాడట. దానిలో భాగంగానే చందు మొండేది దర్శకత్వంలో నాగ చైతన్య సినిమాకి వెన్నెల డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక ఇబ్బంది పడుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి.
నాగ చైతన్య నెక్స్ట్ ప్రాజెక్ట్ లో కామెడీతో కూడిన ఒక మంచి పాత్ర వెన్నెలకి ఉందట. ఇక ఈ సినిమా ఈ సెప్టెంబర్ లోనే సెట్స్ మీదకెళ్లాల్సి ఉంది. దానికి చైతు కూడా సిద్దంగానే ఉన్నాడు కానీ... వెన్నెలకే డేట్స్ లేవట. మరి వెన్నెల లేకుండా సినిమా స్టార్ట్ చెయ్యడమెందుకులే అని చైతు కూడా తన పెళ్లి అయ్యాకే ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళదామని చందూకి చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. దీన్ని బట్టి వెన్నెల రేంజ్ ఎలా మారిందో చూసారా? కేవలం వెన్నెల కిషోర్ కి ఖాళీ లేకపోవడంతో ఒక సినిమా సెట్స్ మీదకి వెళ్లకుండా ఆగిందంటే వెన్నెల రేంజ్ అర్ధమవుతుంది. ఇక వెన్నెల కామెడీ ఈ నెల 29 న విడుదల కాబోయే మహానుభావుడు లో కూడా అదిరిపోనుందని తెలుస్తుంది.