'బాహుబలి-ది బిగినింగ్' విడుదలైన సమయంలో రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం' అని చెప్పాడు. ఇక 'బాహుబలి- ది కన్‌క్లూజన్' పెద్ద హిట్టయినప్పుడు కూడా ఆయన 'మహాభారతం' తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, కానీ తనకు ఇంకా అంత అనుభవం రాలేదని, మరో పదేళ్ల తర్వాత ఏమైనా చేస్తానేమో? అని చెప్పాడో లేదో మీడియాలో మాత్రం 'బాహుబలి-ది కన్‌క్లూజన్' తర్వాత రాజమౌళి 'మహాభారతం' చేస్తున్నాడని అడిగిందే ఆయన్ను అడిగి, ఆయన నోటి వెంట పలు సార్లు క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
మరికొందరైతే దేశవిదేశీ భాషల్లో మోహన్‌లాల్ ప్రధానపాత్రలో దేశంలోని అన్ని భాషలలోని క్రేజ్ ఉన్న నటులతో ఏకంగా 1000కోట్ల బడ్జెట్‌తో 'రాండామూజం'ను 'మహాభారతం'గా తీస్తున్నారని ప్రకటించడంతో రాజమౌళి మహాభారతం తీయాలని అనుకుంటే మోహన్‌లాల్ దానిని హైజాక్ చేసి ముందుగా తీస్తూ రాజమౌళికి ద్రోహం చేస్తున్నాడని మీడియాలో వార్తలను వండి వార్చారు. అప్పుడు కూడా రాజమౌళి అది తన డ్రీమ్ ప్రాజెక్టే కానీ దానిని ఇప్పుడు తీయలేనని స్పష్టం చేశాడు. అయినా మీడియా వదలలేదు.
ఇటీవల రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ని కూడా ఇదే ప్రశ్నించారు. ఆయన కూడా రాజమౌళికి యుద్దాలంటే ఇష్టమని, ముందుగా ఆయన 'మహాభారతం' నా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు తాను కూడా దానిని పట్టించుకోలేదని, కానీ 'బాహుబలి' తీసిన విధానం చూసిన తర్వాత ఆయన 'మహాభారతం' తీయగలడనే నమ్మకం వచ్చిందని చెప్పాడు. మరలా దీంతో రాజమౌళి 'మహాభారతం' తీయనున్నాడని విషయాన్ని వక్రీకరిస్తూ వార్తలు వచ్చాయి. వీటిపై తాజాగా మరోసారి రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు.
దాదాపు ఐదారేళ్లు 'బాహుబలి'నే ప్రపంచంగా బతికిన రాజమౌళి ప్రస్తుతం ఇంకా ఆ విజయాన్ని ఆస్వాదిస్తూనే రిలాక్స్ అవుతున్నానని చెప్పాడు. 'మహాభారతం' తన కలే గానీ తీస్తున్నానని మాత్రం చెప్పలేదని ఆయన స్పష్టం చేశాడు. ప్రస్తుతానికైతే తాను ఏ ప్రాజెక్ట్ మొదలుపెట్టలేదని, కొంతకాలం తర్వాత తాను తన తదుపరి ప్రాజెక్ట్‌ని ప్రారంభిస్తున్నానని చెప్పడం ద్వారా రామ్‌చరణ్‌తో మరోసారి సినిమా తీస్తాడంటూ వస్తున్న వార్తలను ఇన్‌డైరెక్ట్‌గా ఫుల్‌స్టాప్ పెట్టాడు. దీన్ని బట్టి ఆయన ఇంకా తన తదుపరి చిత్రం కథను, హీరోని ఇంకా నిర్ణయించలేదా? లేక రామ్‌చరణ్ సినిమా వార్తలను నేరుగా ఖండించకపోవడంతో ఆ ప్రాజెక్ట్ నిజమేనా? అనే ప్రశ్నలను మాత్రం ఆయన ఆసక్తికరంగా మార్చివేశాడు.