తమిళనాడులో అమ్మ జయలలిత బతికివున్నప్పుడు , కరుణానిధి యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఎవరు రాజకీయాలలోకి వచ్చినా సక్సెస్ అయ్యే స్థితి లేదు. కానీ జయ మరణం, కరుణానిధి వయోభారంతో బాధపడుతున్న వేళ తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడింది. ఇక అజిత్, విజయ్‌లు ప్రస్తుతం రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యం లేదని చెప్పారు. కానీ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రానికి ఇదే సరైన సమయమని ఎందరు విశ్లేషించినా దేవుడు ఆదేశిస్తే వస్తానంటూ ఆయన విషయాన్ని ఇంకా ఇంకా నాన్చుతూ, తన అభిమానులు కూడా ఇదేంటి స్వామీ... మరీ ఇంత నాన్చుడు యవ్వారమా? రాజకీయాలలోకి రావాలనే నిర్ణయమే గట్టిగా తీసుకోలేని రజనీ ఇక ముఖ్యమంత్రి అయితే కఠిన నిర్ణయాలు ఎలా తీసుకుంటాడు? అనిపించేలా ప్రవర్తిస్తున్నాడు.
ఇక ఈ విషయంలో రజనీ కంటే గెలుపు ఓటములను పక్కనపెట్టి తానే బెటర్ అని లోకనాయకుడు కమల్‌హాసన్ నిరూపించుకున్నాడు. ఆయన తాను రాజకీయాలలోకి వస్తున్నానని, ఏ పార్టీలో చేరనని, తాను సొంతగా పార్టీ పెట్టి కొత్త ఏడాది లోపు కదనరంగంలోకి దిగుతానని ప్రకటించేశాడు. ఇక తాజాగా కమల్‌హాసన్ ఇంటికి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ వచ్చి కమల్‌ని కలిసి వెళ్లడం జరిగింది. దీని గురించి కమల్ మాట్లాడుతూ, తాను కేజ్రీవాల్‌ని కలవలేదని, ఆయనే తనను వద్దకు వచ్చి కలిశాడని చెప్పాడు. ఆయన తనను వచ్చి కలవడం ఆయన మంచితనాన్ని సూచిస్తోందని, అయితే తాను ఆమ్ ఆద్మీపార్టీతో చేతులు కలపడం లేదని తేల్చేశారు. తన రాజకీయ రంగ ప్రవేశం గురించి రజనీకాంత్‌కి చెప్పానని, రజనీతో కలిసి పనిచేసేందుకు తాను సిద్దమని, ఆయనతో అప్పుడప్పుడు మాట్లాడుతుంటానన్నాడు. రజనీకాంత్‌కి ఉన్న మత విశ్వాసాలను చూస్తే అతనికి బిజెపియే సరైనదని భావిస్తున్నానని, తాను హేతువాదినని, కుల వ్యవస్థకు వ్యతిరేకినని కానీ తాను కమ్యూనిస్ట్‌ని కాదని చెప్పారు.
రజనీ మత విశ్వాసాల గురించి కమల్ మాట్లాడటం ఓకే గానీ తాను కుల వ్యవస్థకు వ్యతిరేకినని చెప్పడం చూస్తే.. మరి రజనీ కుల వ్యవస్థకు వ్యతిరేకి కాదా.! అనే అనుమానం రాకమానదు. ఇక కమల్‌హాసన్ ఇప్పటికే 'శభాష్‌నాయుడు' సినిమాను మూడు భాషల్లో మొదలుపెట్టాడు. యాక్సిడెంట్ వల్ల సినిమా హోల్డ్‌లో ఉంచాడు. 'విశ్వరూపం2'ని ఆస్కార్ రవిచంద్రన్ నుంచి తానే టేకోవర్ చేస్తున్నానని, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ ఏడాదే విడుదల అని చెప్పాడు. దాని ఊసేలేదు. ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మరుదనాయగం' మరలా మొదలుపెట్టనున్నట్లు తెలిపాడు అది కూడా సదా మామూలే. ఆయన నటించగా విడుదలైన చివరి చిత్రం 2015లో వచ్చిన 'చీకటి రాజ్యం'. దాంతో కమల్ రాజకీయాలలోకి వస్తే ఈ పెండింగ్ ప్రాజెక్ట్‌లన్నీ మూలన పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కమల్ అభిమానులు మాత్రం కమల్ రాజకీయాలలోకి రావడాన్ని సమర్ధిస్తూనే తమ హీరో ప్రస్తుతం పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్‌లనైనా పూర్తి చేయాలని భావిస్తున్నారు.