ప్రశ్నించడం కోసమే తాను పార్టీ పెట్టానని జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్ మొదటి నుండి చెబుతూనే ఉన్నారు. మరోవైపు కేవలం ప్రశ్నించడానికైతే పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని, ఆయన కేవలం ప్రశ్నించడం తప్ప పరిష్కారం చూపలేడని విపక్షాలు విమర్శిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే పోరాట కదనరంగంలోకి దిగకుండా పవన్ కేవలం ప్రశ్నించడానికే పరిమితమవుతున్నాడు. మరోవైపు ఏపీలోని అధికార టిడిపి ప్రభుత్వం, సీఎం చంద్రబాబునాయుడు.... జగన్‌తో పాటు ఇతర పక్షాలు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ సమస్యలను రెచ్చగొడుతూ, పెద్దవి చేస్తుండటంతో వారి విమర్శలను పట్టించుకోవడం లేదు. కానీ తనకు నచ్చిన పవన్ ఏదైనా ప్రశ్నిస్తే మాత్రం ప్రభుత్వంలో కదలిక వస్తోంది. దాంతో ఏ సమస్య ఎక్కడ వచ్చినా దానిని పవన్ ప్రశ్నిస్తేనే చంద్రబాబునాయుడు స్పందిస్తాడని భావించి, సమస్యలు వచ్చిన అందరూ పవన్ వద్దకు వచ్చి మొరపెట్టుకోవడం మామూలైపోయింది.
తాజాగా విశాఖపట్టణంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసిఐ)ని ప్రైవేటీకరించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆందోళన చెందుతున్న ఉద్యోగులు తాజాగా జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్‌ని జనసేన పరిపాలనా కార్యాలయానికి వచ్చి తమ ఆందోళనను పవన్‌కి విన్నవించారు. ప్రభుత్వరంగ సంస్థ అయినా దీనిని ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించిందని ఈ విషయంలో తమ ఆందోళనలను పరిష్కరించాలని ఉద్యోగులు, ఉద్యోగసంఘాల ప్రతినిధులు పవన్‌ని కోరారు. ఈ సంస్థను ప్రైవేటీకరణకు సిద్దంచేయడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దానికి స్పందిన పవన్‌కళ్యాణ్ కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ఇలా చేస్తే ప్రభుత్వరంగ సంస్థలు నష్టపోతాయని, ప్రత్యేకహోదాతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విధివిధానాలు తనకు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పనే తమిళనాడులో చేస్తే ఉద్యోగుల పక్షాన ఆ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడిందని, అయితే ఏపీ ప్రభుత్వం డీసిఐ విషయంలో ఉద్యోగుల పక్షాన ఎందుకు నిలబడటం లేదని ఆయన నిలదీశారు. ఈ సమస్య మీ పరిధిలోకి రాదంటారా? ప్రజాసమస్యలు మీ పరిధిలోకి రావా? అని ఆయన ప్రభుత్వాన్ని ఘాటుగానే నిలదీశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేంద్రాన్ని నిలదీయాలని కోరారు. పవన్ స్పందించిన తర్వాత అయినా ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైనా చలనం వస్తుందో? లేక కేంద్రాన్ని చూసి భయపడి తప్పించుకు తిరుగుతుందో వేచిచూడాల్సివుంది.