మురుగదాస్ - మహేష్ కలయికలో తెరకెక్కుతున్న స్పైడర్ చిత్రం మరో మూడు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు, తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం రెండు భాషల్లోనూ ఒకేసారి విడుదల కాబోతుంది. దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న ఈ చిత్రం మీద భారీ అంచనాలే ఉన్నాయి. బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన స్పైడర్ చిత్రానికి బాహుబలి రేంజ్ పబ్లిసిటీ లేదు... అంటే ఖచ్చితంగా లేదు. మురగదాస్ లాంటి లెజండరీ డైరెక్టర్ తెరకెక్కించాడు.. మహేష్ వంటి స్టార్ నటిస్తున్నాడు... తమిళ దర్శకుడు సూర్య ఒక విలన్, తమిళ హీరో భరత్ మరొక విలన్... అలాగే ఈ సినిమా స్పై థ్రిల్లర్ గా రూపొందింది ఈ విషయాలు తప్పనిచ్చి స్పైడర్ గురించిన చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు.
స్పైడర్ టీజర్స్, ట్రైలర్ తో కాస్త హైప్ క్రియేట్ చేసినప్పటికీ ఆ చిత్రానికి రావాల్సిన ప్రమోషన్ రాలేదు... అలాగే కావాల్సిన పబ్లిసిటీ చెయ్యలేదు. అసలు సినిమా విడుదల దగ్గరయ్యే కొలది హీరో, హీరోయిన్స్ ఇంటర్వ్యూలు, టీవీ ఛానల్స్ లో సినిమాకి సంబందించిన చిత్ర బృందం ఇంటర్వ్యూలు ఇవేమి స్పైడర్ విషయంలో జరగడం లేదు. అసలీ దర్శకుడు మురుగదాస్ కి హీరో మహేష్ బాబు కి స్పైడర్ మీద అంత నమ్మకమా? సినిమాని ప్రమోట్ చెయ్యకపోయినా విజయాన్ని అందిస్తుంది అని నమ్ముతున్నారా? లేదంటే మరేమన్నా కారణాలున్నాయా అనేది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు.
ఇక స్పైడర్ కి జై లవ కుశ మిశ్రమ విజయం మాత్రం కలిసొచ్చేలాగే కనబడుతుంది. స్పైడర్ సినిమా విడుదల అయ్యే సమయానికి ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ హవా ముగిసిపోతుంది. ఇక స్పైడర్ విడుదలయ్యాక సినిమాకి హిట్ టాక్ వచ్చిందా దున్నేస్తుంది. లేదు ఫలితం కాస్త అటు ఇటూ జరిగిందా... ఈ దసరా రేస్ లో ఉన్న శర్వానంద్ - మారుతీ ల మహానుభావుడు రేజ్ అవుతుంది. స్పైడర్ విడుదలయిన రెండు రోజులకే మహానుభావుడు కూడా విడుదలవుతుంది. మరి జై లవ కుశ, స్పైడర్ కి దారిచ్చింది. మరి స్పైడర్ దారిలో అడ్డమొచ్చే మహానుభావుడు ఏం చేస్తాడో చూడాలి.