గురువారం విడుదలైన ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషించిన 'జై లవకుశ' చిత్రం భారీ కలెక్షన్లు సాధిస్తోంది. ఈ చిత్రానికి, మరీ ముఖ్యంగా 'జై' పాత్రకు రాఘవేంద్రరావు, రాజమౌళి వంటి వారి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించిన సంగతి తెలిసిందే. కిందటి ఏడాది నాని నటించిన 'జెంటిల్‌మేన్'ద్వారా ఎంటరై మొదటి చిత్రంతోనే హిట్‌ని ఖాతాలో వేసుకుని, ఈ ఏడాది మరలా నాని నటించిన 'నిన్నుకోరి' చిత్రంతో రెండో విజయం అందుకున్న నివేథాథామస్.. నాని రేంజ్‌ని దాటుకుని ఎన్టీఆర్ పుణ్యమా అని తొలిసారిగా నిజమైన స్టార్‌తో నటించే అవకాశం దక్కించుకుంది.
మరోవైపు యంగ్ హీరోలు రవితేజ, గోపీచంద్ వంటి హీరోలతో చేస్తూ కాలం గడుపుతున్న రాశిఖన్నా కూడా ఈ చిత్రంలో స్టార్ ఎన్టీఆర్ సరసన నటించింది. ఈ చిత్రంలో ఈ ఇద్దరు ప్రేక్షకులను బాగానే అలరించి, హిట్ కొట్టారు. ఈ సందర్భంగా మలయాళీ భామ నివేదాథామస్ హ్యాట్రిక్‌ని కొట్టినట్లయింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఒక సినిమా హిట్ అవ్వడం ప్రత్యేకం. నటించిన మూడు సినిమాలను ఇంత బాగా ఆదరించి, తెలుగు చిత్ర పరిశ్రమ సొంత మనిషిలా చూడటం కన్నా పెద్ద ప్రశంస ఏమీ ఉండదు. దీనిని ఆశీర్వాదంగా భావిస్తున్నాను. నా అభిమానులకు, కుటుంబ సభ్యులకు ఎంతగా ధన్యవాదాలు తెలిపినా తక్కువే. 'జై లవకుశ'కి ఇంత పెద్ద విజయం అందించినందుకు కృతజ్ఞతలు. మరో అందమైన చిత్రంలో, మరో పాత్రతో మిమ్మల్ని కలుస్తా.. ప్రేమతో మీ నివేదాథామస్ అని ఆమె పేర్కొంది.
కాగా 'జై లవ కుశ' విడుదల సమయంలో వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న'తొలిప్రేమ' షూటింగ్‌లో లండన్‌లో ఉన్న రాశిఖన్నా అక్కడే ఎన్టీఆర్ అభిమానులతో కలిసి చిత్రం చూసి, చిత్రం సాధించిన విజయానికి పొంగిపోయింది. దాంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆమె చేత కేక్‌ను కట్ చేయించి, ఆమెతో ఆనందాన్ని పంచుకున్నారు. మొత్తానికి ఒకే ఒక్క స్టార్ ఎన్టీఆర్ ఒకే చిత్రం 'జై లవ కుశ'లోని మూడు పాత్రల ద్వారా అదరగొట్టి, ఇద్దరు హీరోయిన్లకు స్టార్ హోదాను తెచ్చిపెట్టాడని భావించవచ్చు.