ఇటీవల వచ్చిన కొత్త నియమ నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి బయోపిక్‌ని తీయాలంటే ఆయన బతికుంటే ఆయన అనుమతి, ఆయన మరణిస్తే ఆయన భార్య, ఆమె కూడా మరణిస్తే అప్పుడు కుటుంబసభ్యుల అనుమతి తప్పనిసరి. అందుకే మన్మోహన్‌సింగ్‌పై తీసే చిత్రానికి నానా ఇబ్బందులను ఆ యూనిట్ పడింది. ఇక ఓ బయోపిక్ తీయాలంటే అందులో వారు చేసిన మంచి, చెడు, వేదన, ఆవేదన, నిజజీవిత పరిస్థితులు, సంతోషాలు ఎత్తుపల్లాలు అన్ని చూపితేనే అది బయోపిక్ అవుతుంది. అంతేగానీ కేవలం ఓకే కోణంలో చూపిస్తే దానిని బయోపిక్ అనడం కన్నా భజన చిత్రంలా ఉండే డాక్యుమెంటరీ అనాల్సివస్తుంది.
ఇక బాలకృష్ణ ఈమద్య తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌ని తీస్తానని అందులో తన తండ్రి పాత్రను తానే చేస్తానని చెప్పాడు. మీడియా వారు వివాదాలను కూడా చూపుతారా? అని ప్రశ్నిస్తే ఆయన జీవితంలో ఎక్కడి నుంచి చిత్రాన్ని మొదలు పెట్టాలో ఎక్కడ ముగింపు చెప్పాలో తనకు బాగానే తెలుసునని ఫైర్ అయ్యాడు. అయితే కొన్ని అనుకోని కారణాలు, ఏర్పడిన పరిస్థితుల నేపధ్యంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో ఎన్టీఆర్ బయోపిక్‌ను తాను కూడా తీస్తానని తెలిపాడు. ఇందులో ఎన్టీఆర్ జీవితంలోని సుఖ దు:ఖాలు, వేదనలు, చివరి రోజుల్లో ఎదుర్కొన్న పరిస్థితులు, అవమానాలను కూడా తీస్తానని చెప్పి సంచలనం సృష్టించాడు. దీంతో గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకునే పలువురు వర్మను టార్గెట్ చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమా విషయమై లక్ష్మీపార్వతి స్పందించింది. ఎన్టీఆర్‌పై చిత్రం తీయాలంటే భార్యగా తన అనుమతి తప్పనిసరి అని, కుమారుల అనుమతి అవసరం లేదని చెప్పింది. తమ ఇద్దరిపై తీసే చిత్రానికి తానే అనుమతిని ఇవ్వాల్సి వుంటుందని చెప్పింది. తాను ఎన్టీఆర్‌కి భార్యను కాదని పదే పదే తనను అవమానిస్తున్నారని, తమ పెళ్లికి చంద్రబాబే ప్రత్యక్షసాక్షి అని ఆమె తెలిపారు. ఎన్టీఆర్‌పై ఖచ్చితంగా సినిమా రావాల్సిందే...అయితే ఎన్టీఆర్ జీవిత చరిత్రను సరైన రీతిలో చూపిస్తేనే నేను అనుమతినిస్తా...పిచ్చి రాతలు, పిచ్చి కూతలు చూపిస్తే తానే ఎదురు తిరుగుతాను. ఎన్టీఆర్ వాదనను, వేదనను చూపిస్తేనే తాను ఒప్పుకుంటానని ఆమె అంటోంది.
అయినా ఒక మనిషి ఎంత గొప్పవాడైనా అందరిలోనూ మంచి, చెడు, మంచి పనులు, చెడ్డపనులు, విమర్శలు, ప్రతి విమర్శలు.. ఇలా అన్ని ఉంటాయి. చివరకు జీసస్‌ని, గాంధీని కూడా రెండు కోణాలలో ఆవిష్కరించిన చిత్రాలు వచ్చాయి. మరి ఎన్టీఆర్‌ని బాలయ్య, లక్ష్మిపార్వతిలు ఎవరి కోణంలో వారు దేవుళ్లుగా చూపించాలని భావిస్తున్నారు. లక్ష్మీపార్వతికి అనుకూలంగా ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎదుర్కొన్న పరిణామాలను ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూల ఆధారంగా తీస్తే నందమూరి కుటుంబసభ్యులు ఒప్పుకోరు. పోని ఎన్టీఆర్ జీవితంలోని ఇతర కోణాలను చూపించకపోతే లక్ష్మీపార్వతి అనుమతి ఇవ్వదు. మరి ఈ పరిస్థితుల్లో బాలయ్య తీసే బయోపిక్, వర్మ తీసే బయోపిక్‌లు అసలు తెరకెక్కుతాయా? అవి నిజరూపం దాలిస్తే ఎవరి చిత్రానికి ఎంతటి ఆదరణ లభిస్తుంది? అనేది వేచిచూడాల్సిన విషయం.