'బాహుబలి' సమయంలో రాజమౌళి తనకు 'మహాభారతం' తీయాలనేది లైఫ్ టైం గోల్‌గా పేర్కొన్నాడు. కానీ అది ఇప్పుడు కాదని, అది తీయాలంటే తనకు మరో పదేళ్ల అనుభవం కావాల్సివుందని పేర్కొన్నాడు. అంతేగానీ 'బాహుబలి' తర్వాత వెంటనే 'మహాభారతం' తీస్తానని మాత్రం ఆయన చెప్పలేదు. మరోవైపు మలయాళంలో మోహన్‌లాల్ 'రాండాముజం' నవల ఆధారంగా 1000 కోట్లతో 'మహాభారతం' తీయనున్నట్లు అనౌన్స్ చేశాడు. దీంతో మీడియా అత్యుత్సాహం చూపించి రాజమౌళి తీయాలనుకున్న 'మహాభారతం' సినిమాను మోహన్‌లాల్ హైజాక్ చేశాడనే వార్తలను వండి వార్చింది.
అయితే 'రామాయణం, మహాభారతం' వంటి కావ్యాలు అజరామరం. అంతేకాదు... వీటిని ఎవరు ఎన్నిసార్లు తీసినా ఇంకా దాంట్లో చెప్పాల్సింది ఎంతో ఉంటుంది. దానిపై రాజమౌళి స్పందిస్తూ 'మహాభారతం' అనే కావ్యం మహాసముద్రమని, ఎంత మంది తీసినా అందులో ఓ చెంబుడు నీళ్లను కూడా తీయలేరని, తాను తీసే 'మహాభారతం' ఇప్పుడు కాదని చెప్పాడు. ఆయన తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ కూడా తన కుమారుడికి 'మహాభారతం' తీయాలనేది డ్రీమ్ అని, మొదట్లో తాను ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదని, కానీ రాజమౌళికి యుద్దాలంటే చాలా ఇష్టమని, కాబట్టి 'బాహుబలి' చూసిన తర్వాత తన కుమారుడు 'మహాభారతం' తీయగలడు అనే నమ్మకం కలిగిందని చెప్పుకొచ్చాడు. అయినా మన మీడియా ఈ విషయం వదలడం లేదు. రాజమౌళి, విజయేంద్రప్రసాద్‌లు ఎప్పుడు కనిపించినా మహాభారతం ఎప్పుడు? అనే ప్రశ్నలతో విసిగిస్తున్నారు.
తాజాగా మీడియా.. వారిద్దరిని వదిలేసి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ని కూడా అదే ప్రశ్నలతో వేధించారు. 'మహాభారతం'ను మీ స్నేహితుడు రాజమౌళి తీస్తున్నారట కదా..! అందులో మీరు నటిస్తారా? అని అడిగారు. దానికి ఎన్టీఆర్ రాజమౌళి ఏ పాత్ర చేయమన్నా తాను చేయడానికి సిద్దమేనని, కానీ ఈ విషయం తనను కాదు.. రాజమౌళి, విజయేంద్రప్రసాద్‌లను అడిగి క్లారిటీ తీసుకుంటే బాగుంటుందని చెప్పేశాడు. ఈ విషయం కూడా రాజమౌళి ఎప్పుడో క్లారిటీ ఇచ్చాడు. తనకు జూనియర్ ఎన్టీఆర్‌ని శ్రీకృష్ణునిగా చూడాలని ఉందని ఎప్పుడో చెప్పాడు. మరోవైపు వినాయక్ కూడా తనకు తారక్‌తో 'దాన వీర శూర కర్ణ' తీయాలని ఉందని చెప్పాడు. విషయం ఇంత క్లారిటీగా ఉన్నా ఇప్పటికీ కనిపించిన వారినందరినీ అవే ప్రశ్నలను మరలా మరలా అడగటం సరైన విధానం కాదు.