ఈ ఏడాది ఖైదీ తో హిట్ కొట్టిన చిరంజీవి ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టడానికి ఆచి తూచి అడుగు వేస్తున్నాడు. చిరు 151 వ ప్రాజెక్ట్ 'సై రా' చిత్రం ఆఫీషియల్ గా మొదలైనప్పటికీ ఆ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా మొదలు కాలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నాలుగు భాషల్లో విడుదల కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో నాలుగు భాషల నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారనే విషయాన్ని కూడా సై రా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకముందే ఈచిత్రం నుండి ఇద్దరు టాప్ టెక్నీషియన్స్ తప్పుకున్నట్లుగా కూడా వార్తలొచ్చాయి. సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్, సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చెయ్యడం కోసం దర్శకుడు సురేందర్ రెడ్డి అన్ని రకాలుగా సంసిద్ధమయినట్లు వార్తలొస్తున్నాయి. ఇక ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఆ పనుల కోసం సురేందర్ రెడ్డి లండన్ కి వెళ్లినట్లుగా చెబుతున్నారు.
అక్కడ సురేందర్ రెడ్డి ఒక ప్రముఖ VFX స్టూడియోస్ తో ఒప్పందం కుదుర్చుకొని త్వరలోనే షూటింగ్ ని స్టార్ట్ చేయబోతున్నాడని సమాచారం. ఇక హీరో చిరు కూడా 'సైరా నరసింహారెడ్డి' లుక్ కోసం బాగా శ్రమిస్తున్నాడనే టాక్ వినబడుతుంది. మరి చిరు సై రా నరసింహరెడ్డిగా ఎలా కనిపిస్తాడా అనే క్యూరియాసిటీతో మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇకపోతే సైరా కోసం బ్రిటిష్ కాలంనాటి సెట్టింగ్స్ కోసం ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడా స్టూడియో లో భారీ సెట్ ను వేశాడట. ఇక ఆ సెట్ అలనాటి బ్రిటిష్ సామ్రాజ్యం మరియు రాజుల కోటలతో ఈ సెట్ ఉండనుందనే విషయం తెలిసిందే. ఇక దీన్ని బట్టి సై రా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుందన్నమాట.