తెలుగులో 'శివ' తర్వాత ట్రెండ్‌సెట్టర్‌గా అందరూ ఒప్పుకుంటున్న చిత్రం 'అర్జున్‌రెడ్డి'. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో కేవలం నాలుగు కోట్లతో తెరకెక్కిన ఈచిత్రం 50కోట్ల దాకా వసూలు చేసింది. ఈ చిత్రంతో హీరో విజయ్‌దేవరకొండ నైట్‌కి నైట్ స్టార్ అయిపోయాడు. అదే తరహాలో ఈ చిత్రం దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కూడా ఓవర్‌నైట్ లో వర్మ తెచ్చుకున్నంత క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ 'శివ' సాధించిన ఒరవడికి 'అర్జున్‌రెడ్డి' సృష్టించిన అలజడికి ఒకటే తేడా. 'శివ' చిత్రం ముందు నాగార్జున హీరోగా కాస్త ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఆయన స్టార్ కావడంతో 'శివ'ను చేసిన రాంగోపాల్‌వర్మకి తర్వాత వెంకటేష్, శ్రీదేవిలతో 'క్షణక్షణం' చాన్స్ వచ్చింది. కానీ 'అర్జున్‌రెడ్డి'లో నటించిన విజయ్‌దేవరకొండ 'పెళ్లిచూపులు'తో సక్సెస్ అయినా కూడా ఆయన రేంజ్, పరిధి చాలా చిన్నవి కావడంతో వర్మలాగా ఈ చిత్రం దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాకి పెద్ద హీరోల నుంచి చాన్స్‌లైతే రాలేదు.
ఇక దర్శకునిగా కూడా ఆయన తన అభిరుచి ప్రకారం, తాననుకున్నట్లు చిత్రాలు తీయడానికి ఇష్టమున్న వారినే పెట్టుకుని సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. దాంతో చాలామంది తర్వాత ఈ దర్శకుడితో చేయవచ్చులే అని భావిస్తున్నారు. ఇదే సమయంలో సందీప్‌రెడ్డి వంగాకి అవసరమైన బడ్జెట్, ఆయన తనకు నచ్చినట్లుగా సినిమా తీసే స్వేచ్చని ఇవ్వడానికి ఆది సాయికుమార్‌తో 'చుట్టాలబ్బాయ్' చిత్రాన్ని నిర్మించిన వెంకట్ తలారి ఓకే చెప్పాడు. ఇక వైవిధ్యభరితమైన చిత్రాలను తీసే శర్వానంద్ ఈచిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం నానివంటి హీరోలతో పోల్చుకుంటే శర్వానంద్ కాస్త తక్కువ పొజిషన్‌లో ఉన్నాడు. కేవలం 25 కోట్ల మార్కెట్ అందుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నాడు.
కానీ సందీప్ వంగాతో చేసే చిత్రంతో పాటు ఈనెల 29న మారుతి దర్శకత్వంలో చేసిన 'మహానుభావుడు' చిత్రాలు బాగా ఆడి, ఒక్క చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచినా కూడా శర్వానంద్ 50కోట్ల క్లబ్‌లో చేరతాడని శర్వానంద్, ఆయన అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఆశపడుతున్నాయి. అయితే తెలుగులో ద్వితీయ విఘ్నం ఎక్కువమంది దర్శకులకు అందునా మొదటి చిత్రాలతో అద్భుతమైన విజయాలు సాధించి, బ్లాక్‌బస్టర్స్‌గా నిలిపిన వారికి ఎదురవుతోంది. ఎక్కడో తేజ, కొరటాలశివ వంటి వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. మిగిలిన చాలామంది రెండో చిత్రంతో ఫల్టీలు కొట్టేవారే ఎక్కువ. మరి శర్వా-సందీప్‌ల కాంబినేషన్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి....!