అప్పుడెప్పుడో సూపర్‌స్టార్ కృష్ణ ఓ వెలుగు వెలుగుతున్న రోజుల్లో 'ముఖ్యమంత్రి' అనే టైటిల్‌తోనే తానే ముఖ్యమంత్రిగా నటించిన ఓ చిత్రం చేశాడు. తర్వాత ఎన్టీఆర్ సీఎం అయినా తర్వాత ఎన్టీఆర్‌ను పోలిన ముఖ్యమంత్రులుగా సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు వంటి వారితో 'సాహసమే నా ఊపిరి, మండలాధీశుడు' వంటి చిత్రాలు చేశాడు. ఇక దాసరి 'ఎమ్మెల్యే ఏడుకొండలు' మోహన్‌బాబు 'యం.ధర్మరాజు ఎంఏ' వంటి చిత్రాలతో బాగా ఆకట్టుకున్నారు.
ఇక తమిళం, తెలుగులో వచ్చిన శంకర్ చిత్రం 'ఒకే ఒక్కడు'లో యాక్షన్‌కింగ్ అర్జున్ ఒకరోజు ముఖ్యమంత్రిగా నటించాడు. ఇక యంగ్‌హీరోలలో దగ్గుబాటి రానా తన మొదటి చిత్రమైన 'లీడర్'లో శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో సీఎంగా నటించాడు. 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంలో కూడా రాజకీయ నాయకునిగా బాగా నటించి ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా నాడు కృష్ణ చేసిన తరహాలోనే ఆయన కుమారుడు మహేష్‌బాబు కూడా కొరటాల శివ దర్శకత్వంలో దానయ్య నిర్మాతగా నిర్మిస్తున్న 'భరత్ అనే నేను' చిత్రంలో మహేష్ యంగ్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు.
మహేష్ 'స్పైడర్' షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, రిలీజ్ ప్రమోషన్స్, సినిమా విడుదల తర్వాత.. మహేష్ ఇప్పటికే షూటింగ్ మొదలైన 'భరత్ అనే నేను'లో జాయిన్ కానున్నాడు. కాగా ఈ చిత్రం కోసం అన్నపూర్ణ స్టూడియోలో అసెంబ్లీ సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు. అసెంబ్లీ సెట్‌తోపాటు ఇక రాజకీయ నాయకులు, వారి అనుచరులు, కార్యకర్తల వేషాలలో ఖద్దరు దుస్తులు, కండువాలు కప్పుకొన్న సినీరాజకీయ నాయకులతో అన్నపూర్ణ స్టూడియోస్‌కి రాజకీయ కళ వచ్చేసింది. కాగా ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.