టీవీ హోస్ట్ నుంచి దర్శకునిగా మారిన ఓంకార్ లో-బడ్జెట్‌లో 'రాజు గారి గది' చిత్రం తీసి పెద్ద హిట్ కొట్టాడు. కానీ నిజంగా చెప్పాలంటే ఈ చిత్రం చాలా రొటీన్. కానీ కొన్ని సినిమాలు ఎందుకు హిట్టవుతాయో? కొన్ని ఎందుకు ఫ్లాప్ అవుతాయో? ప్రేక్షకుల నాడి ఇప్పటివరకు పూర్తిగా చెప్పే వారులేరు. అలాంటి వారే ఉంటే అన్ని హిట్సే వస్తాయి కదా...! ఇక ఓంకార్ తీసిన 'రాజుగారి గది' చిత్రం ఏదో అనూహ్యంగా హిట్టయి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఎప్పుడు కొత్త టాలెంట్‌ని అవకాశాలు ఇచ్చే నాగార్జున ఆశ్చర్యకరమైన రీతిలో ఓంకార్‌ని నమ్మి 'రాజుగారి గది 2'లో నటించడానికి ఒప్పుకున్నాడు. దీంతో ఓంకార్ నిజంగానే నక్కతోక తొక్కాడని చెప్పుకున్నారు. ఇక ఈ చిత్రం కథ 'రాజు గారి గది'కి కొనసాగింపు కాదని, ఓ మలయాళ చిత్రం రీమేక్‌గా దీనికి ఆ టైటిల్‌ను ఉపయోగించుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
ఎలాగూ పీవిపీ సంస్థతో నాగార్జునకి మంచి అనుబంధం కూడా ఉండటం ఈ చిత్రంలో నాగ్ నటించడానికి మరో కారణంగా చెప్పాలి. అయితే ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయినా కూడా నాగ్‌కి కొన్ని సీన్స్ నచ్చకపోవడంతో రాజీ పడని నాగ్ మరలా ఆ సీన్స్‌ని రీషూట్ చేయించాడు. ఇక ఆయన ఆల్‌రెడీ ఈచిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 13న వస్తుందని కూడా క్లారిటీ ఇచ్చాడు. తనకు నచ్చకుంటే ప్రెస్‌మీట్ కూడా పెట్టనని చెప్పిన నాగ్ పూర్తిగా శాటిస్‌ఫై కావడంతోనే రిలీజ్ డేట్ ఇచ్చాడని అర్ధమైంది. కాగా ఈ చిత్రం ట్రైలర్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా విడుదలైంది.
బీచ్ ఒడ్డున ఉండే ఓ బంగ్లాలో ఓ అమ్మాయి ఆత్మ ఉంటుంది. ఆ కనిపించని ఆత్మే ఈ చిత్రంలో నటిస్తున్న సమంతది అని స్పష్టమవుతోంది. ఇక ఇందులో మెంటలిస్ట్‌గా, మనుషుల మనసులతో ఆడుకునే క్యారెక్టర్‌లో నాగార్జున కనిపిస్తున్నాడు. ఇక ఈ టీజర్‌లో ఇందులో నటిస్తున్న సీరత్‌కపూర్ చేత బికినీ వేయించి వెనుక వైపు నుంచి చూపించారు. ఇక 'రాజుగారి గది' లాగానే భయపడి, హాస్యం పండించేందుకు వెన్నెల కిషోర్, షకలక శంకర్, ఉన్నారు. ఈ టీజర్ మొత్తానికి మణిశర్మ తర్వాత తెలుగులో బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో దిట్టయిన తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ అదిరిపోయింది.ఇక ఈచిత్రంతో తన సత్తా అక్టోబర్13న చూపిస్తానని ఓంకార్ అంటున్నాడు. అదేమాట నాగ్‌చెబితే నమ్మవచ్చేమో గానీ ఓంకార్ చెబితే నమ్మకం కుదరడం లేదు. మరి సినిమా విడుదల తర్వాత 'రాజగారి గది'లాగానే ఓంకార్ ఏమైనా మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి...!