భారీ అంచనాలనేవి రెండు వైపుల పదునుండే కత్తిలాంటివి. సరిగా ఉపయోగించుకుంటే మేలుని చేస్తాయి... తేడా వస్తే పెద్ద దెబ్బేతీస్తాయి. ఆ విషయం గమనించిన రాజమౌళి 'బాహుబలి' సీరిస్‌కు ఇతర భాషల్లో భారీ ప్రమోషన్లు చేశాడు. కానీ తెలుగులో మాత్రం తూతూ మంత్రం అనిపించాడు. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడి. సినిమాని ఎంతో అద్భుతం అనుకుని థియేటర్‌కి వెళ్లిన ప్రేక్షకులకు కాస్త సినిమా యావరేజ్‌గా ఉన్నా కూడా అసంతృప్తి చెందుతాడు.
దాంతో చిత్రం రిజల్ట్ యావరేజ్ నుంచి ఫ్లాప్‌కి పడిపోతుంది. అదే లో ప్రొఫైల్ మెయిన్‌టెయిన్ చేయాలంటే మరో తలనొప్పి ఉంది. సినిమా ఎంత బాగున్నా, బాగులేకపోయినా మూడు నాలుగు వారాల వరకు కూడా కలెక్షన్లు ఉండటం లేదు. అదే ఫ్లాప్ టాక్ వస్తే ఫస్ట్ వీకెండ్‌తో సరిపెట్టుకోవాల్సిందే. దాంతో అద్భుతమైన ఓపెనింగ్స్, షోలను పెంచడం వంటివి చేసి, భారీ హైప్ వస్తే కనీసం వారమైనా కలెక్షన్లు ఉండి కొన్నవారు, నిర్మాతలు కాస్త తక్కువ నష్టంతో బయటపడతారు. ఇక 'స్పైడర్' చిత్రం టీజర్లు, ట్రైలర్స్ చాలా నార్మల్‌గా ఉన్నాయి. ఉండటం కాదు.. భారీ అంచనాలు ఏర్పడకూడదనే మురుగదాస్ వాటిని అలా కట్ చేశాడు.
తమిళంలో ప్రమోషన్స్ పెంచాలని చూస్తున్నాడే తప్ప తెలుగులో రాజమౌళి ఫాలో అయిన బాటలోనే నడుస్తున్నాడు. ఈ టీజర్‌లో ఎలాంటి థ్రిల్స్‌లేవు. కానీ సినిమాలో ఎన్నో థ్రిల్స్ ఉన్నాయని, వాటిని వెండితెర మీద చూస్తేనే మజా వస్తుందని ఊరిస్తున్నాడు. ఇక ఈచిత్రం బిజినెస్ అదిరిపోయే లెవల్లో జరిగింది. 'బాహుబలి, కబాలి' తర్వాత కేవలం థియేటికల్ రైట్స్‌తోనే ఏకంగా 150కోట్ల బిజినెస్ చేసిన చిత్రం ఇదేనని ప్రచారం జరుగుతోంది. మరి ఈ మొత్తాన్ని రాబట్టాలంటే టిక్కెట్ల రేట్లు, షోలు పెంచడం తప్పనిసరి. ఇప్పటికే తెలంగాణలో ఐదు షోలకు అనుమతి ఇచ్చారు. ఇక ఏపీ సంగతే ఎటూ తేలడం లేదు. ఎప్పటికైనా పనికొస్తాడని చంద్రబాబు ముందు చూపుతో షోల పెంపుకు అంగీకారం తెలిపినా.. మరో పక్క టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ మీడియేషన్ చేసినా షోల పెంపుకు ఏపీలో కూడా అనుమతి లభించడం కష్టమేం కాదు.
కానీ ఈచిత్రం కంటే ఓ వారం ముందుగా ఎన్టీఆర్ నటించిన 'జై లవ కుశ' విడుదల కానుంది. 'స్పైడర్'కి షోలను పెంచి, 'జై లవ కుశ'కు పెంచకపోతే ఎన్టీఆర్ అభిమానులతో కోరికోరి వైరం తెచ్చుకున్నట్లు అవుతుంది. పోనీ ఎన్టీఆర్ కూడా తనకు ఎప్పుడోప్పుడు పనికొస్తాడని చంద్రబాబు దూర దృష్టితో ఆలోచించినా, మొండి బాలయ్య మాత్రం చంద్రబాబు వద్ద వద్దనే చెబుతాడు. దీంతో జై లవ కుశ, స్పైడర్‌లకు షోల పెంపుపై ఏపీలో సందిగ్దత నెలకొని ఉంది.
మరోవైపు 'స్పైడర్' చిత్రం ద్వారా మహేష్‌బాబు కోలీవుడ్‌లో కూడా స్ట్రెయిట్ ఎంట్రీ ఇస్తున్నాడు. మరి కృష్ణ తనయుడు కాబట్టి తెలుగులో ఆయన్ను మొదట ప్రిన్స్ అని, ఇప్పుడు సూపర్‌స్టార్ అని అంటున్నారు. మరి తమిళంలో మహేష్‌కి ఏం బిరుదు ఇస్తారో వేచిచూడాల్సివుంది..!