నేడు ఇండస్ట్రీని ఓ కుదుపు కుదుపున్న సమస్య పైరసీ. తమిళంలో తమిళ రాకర్స్ వారు సినిమా వచ్చిన గంటలోనో, మరీ కాదంటే రిలీజ్‌కి ముందే సినిమాను నెట్‌లో పెట్టేస్తున్నా.. ఎవ్వరూ ఏమి చేయలేని పరిస్థితి. ఇక తమిళంలో అందరూ కలిసి పైరసీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే, తెలుగులో మాత్రం మన హీరోలు, దర్శకనిర్మాతలు తమ చిత్రాలు విడుదలైనప్పుడు మాత్రమే పైరసీ గురించి మాట్లాడుతుంటారు. ఇక తాజాగా తెలుగు చిత్రాలు కూడా ఒకటి రెండు రోజుల్లోనే మొబైల్ ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్నాయి.
అయితే తెలుగులో అందరూ కలిసి కట్టుగా ఈ విషయంలో చిత్తశుద్దితో పనిచేయడం లేదు. పక్క స్టార్ చిత్రం విడుదలైతే వారి వ్యతిరేకులు, వారి చిత్రాలు విడుదలైతే వారి వ్యతిరేకులు మాఫియాగా ఏర్పడి వారిలో వారే దీనికి కారణమవుతున్నారు. 'డిజె' సమయంలో పైరసీ గురించి మీడియాకు, ప్రేక్షకులు ఓ రేంజ్‌లో క్లాస్ పీకిన దిల్‌రాజు, అల్లు అర్జున్, హరీష్ శంకర్‌లు వాళ్ల చిత్రం ఆడుతున్నంత కాలం ఆ సోది చెప్పారు. మరి త్వరలో విడుదల కానున్న ఎన్టీఆర్ 'జై లవ కుశ', మహేష్ బాబుల 'స్పైడర్' చిత్రాల విషయంలో పైరసీ జరిగితే మాత్రం బన్నీతో సహా అందరూ మౌనంగా వినోదం చూస్తూ ఉంటారు.
ఇక తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులతో యంగ్ హీరో రాజ్‌తరుణ్ మాట్లాడాడు. దీంతో ఓ అభిమాని భయ్యా 'మీ 'అంధగాడు' చిత్రం పైరసీ లింక్ ఇవ్వు అని డైరెక్ట్‌గా రాజ్‌తరుణ్‌నే అడిగేసరికి ఆయన బిత్తరపోయాడు '. నా సినిమా పైరసీ లింక్ నన్నే అడుగుతున్నావు సోదరా.. ఇది మరీ అన్యాయం కదా...! అని రాజ్‌తరుణ్ శాంతంగానే స్పందించాడు. అలా ఉంది పరిస్థితి.