ఇండియన్ మైఖేల్ జాక్సన్ ఎవరంటే దేశంలోని అందరూ డ్యాన్సింగ్ సెన్సేషన్ ప్రభుదేవా పేరు చెబుతారు, మొదట్లో తెరవెనుక కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన ఆయన ఆ తర్వాత తానే వెండితెరపై చిందులు వేస్తూ, స్పెషల్ సాంగ్స్ చేస్తూ కోట్లాది మంది హృదయాలలో నిలిచిపోయాడు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్‌గా మారి తర్వాత హీరోగా కూడా పలు చిత్రాలలో నటించాడు. నటునిగా ఎక్కువగా తన ఫిజిక్, డైలాగ్ డెలివరి, బాడీలాంగ్వేజ్‌తో సీరియస్ క్యారెక్టర్లు చేసినా తనదైన అమాయకపు మొహంతో నవ్వులు పూయించాడు.
ఇక 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రంతో దర్శకుని అవతారం ఎత్తాడు. ఏకంగా మెగాస్టార్ నటించిన 'శంకర్‌దాదా జిందాబాద్'ని కూడా డైరెక్షన్ చేశాడు. కానీ ఈ చిత్రం ఫ్లాపయింది. ఇక ఆయన ఆ తర్వాత తెలుగలో హిట్టయిన సినిమాలను తమిళంలో రీమేక్‌లు చేస్తూ, బాలీవుడ్‌కి వెళ్లి దక్షిణాది రీమేక్ చిత్రాల దర్శకునిగా ముద్ర వేశాడు.మొదట్లో విజయాలు వచ్చినా తర్వాత ఫ్లాప్‌లు మొదలయ్యాయి. ఇక ఆయన తన మాతృభాష అయిన తమిళంలో నటించి ఎనిమిదేళ్లు అయింది. ఈమధ్యలో ఆయన 'అభినేత్రి' (తమిళంలో 'దేవి') చిత్రంలో నటించాడు. కాగా ప్రస్తుతం ఆయన మరలా నటునిగా బిజీ కావాలని నిర్ణయించుకున్నాడు. 'పిజ్జా' ఫేం కార్తీక్ సుబ్బరాజ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి పలు ప్రత్యేకతలున్నాయి. ప్రభుదేవా నటించడం ఓ విశేషం అయితే ఇందులో ఆయన లీడ్‌రోల్‌ని పోషిస్తున్నాడు.
ఈ పాత్ర ఫుల్‌లెంగ్త్ విలన్ పాత్ర కావడం మరింత ఆశ్చర్యకరం. ఇప్పటి వరకు మామూలు పాత్రలు చేసిన ఆయన ఇలా విలన్ పాత్రలో నటించి ఎలా మెప్పిస్తాడో వేచిచూడాల్సివుంది. ఇక ఈచిత్రంలో మాటలు ఉండవు. దాదాపు ఇది మూకీ చిత్రం కావడం మరో విశేషం. అంటే కమల్ హాసన్,అమల జంటగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన 'పుష్పక విమానం' తరహాలో డైలాగ్‌లు లేకుండా థ్రిల్లర్ జోన్‌లో రూపొందుతోంది. ఈచిత్రానికి మెర్క్యురీ అనే టైటిల్‌ను పెట్టారు.