ఎన్టీఆర్ ఇమేజ్, క్రేజ్, ఆయనకున్న స్టామినా అందరికీ తెలుసు. కేవలం పెద్దగా పస లేని, డివైడ్ టాక్ తెచ్చుకున్న 'జనతా గ్యారేజ్' సాధించిన కలెక్షన్లను చూసి ఇతర స్టార్స్, వారి అభిమానులు, ట్రేడ్ విశ్లేషకులు కూడా నివ్వెరపోయారు. ఎన్టీఆర్ వంటి స్టార్‌కి ఎన్ని ఫ్లాపులొచ్చినా ఒక్క యావరేజ్ చిత్రం పడితేనే కలెక్షన్లు ఏ రేంజ్‌లో ఉంటాయో 'జనతా గ్యారేజ్' చిత్రం నిరూపించింది. 'టెంపర్'కి ముందు వచ్చిన భారీ పరాజయాలను చూసి ఎందరో ఎన్టీఆర్‌పై సెటైర్లు వేసి నవ్వుకున్నారు. కానీ నవ్విన నాపచేను సామెతను ఎన్టీఆర్ నిరూపించాడు.
మరి ఆ చిత్రమే అలా కలెక్షన్లు కుమ్మేసి టాలీవుడ్ హయ్యస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది. మరి తాజాగా వస్తున్న 'జై లవ కుశ'పై భారీ అంచనాలున్నాయి. ప్రతి ప్రేక్షకుడు, చివరకి ఇతర హీరోల అభిమానులు సైతం ఈ చిత్రంలోని 'జై' పాత్ర కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం థియేటికల్ రైట్సే ఏకంగా 85 కోట్లకు అమ్ముడయ్యాయి. మొత్తం బిజినెస్ 110 కోట్లకు చేరింది. గురువారమే రిలీజ్ కావడంతో లాంగ్‌వీకెండ్ దీనికి కలిసిరానుంది. ఇక ఈ చిత్రం టాక్ బాగుంటే దసరాసెలవులను కూడా కుమ్మేస్తుంది.
దీనికి తోడు తెలంగాణలో ఐదు షోలకు అనుమతి అనేది ఈ చిత్రంతోనే మొదలుకానుండటం విశేషం. సినిమా టాక్ ఎలా ఉన్నా కలెక్షన్లు మొదటి వీకెండ్‌లో అదిరిపోతాయని, తొలి వారాంతంలోనే ఈ చిత్రం 100 కోట్లు సాధించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. 'జై లవ కుశ' సినిమాపై ఉన్న హైప్, ముఖ్యంగా 'జై' పాత్రకి వస్తున్న రెస్పాన్స్ చూస్తే మాత్రం వీకెండ్‌లోనే ఈ చిత్రం 100 కోట్లక్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.