మహేష్‌బాబు మహా సిగ్గరి. బిడియస్తుడు.. సినిమా షూటింగ్‌లలో ఆయన జోక్స్ వేస్తూ, తాను నవ్వుతూ, అందరినీ నవ్విస్తాడని యూనిట్‌వారు, డైరెక్టర్లు, హీరోయిన్లు, తోటి నటులు చెబుతుంటే వినడమే గానీ, ఆయన బయటి ప్రపంచానికి మాత్రం మొహమాటస్తుడే. ఇక ఆయన తన సినిమాలైనా, ఇతర హీరోల సినిమాలైనా సరే సినిమా గురించి, అభిమానుల గురించి మాట్లాడమంటే నాలుగు మాటలు తడబడుతూ మాట్లాడి మౌనంగా ఉండిపోతాడు. కానీ ఆయన 'స్పైడర్' చిత్రం ప్రీరిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడిన తీరు శిల్పకళావేదికలో ఉన్నవారినే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు హీరోల అభిమానులను, ఈ వేడుకను టీవీలలో చూసిన వీక్షులను మాత్రం ఎంతో ఆకట్టుకుంది.
ఈ వేడుకలో ఆయన మాట్లాడుతూ, మురుగదాస్ తనని 'పోకిరి' సినిమా సమయంలో కలిశాడని, ఆయనతో చిత్రం చేయడానికి పదేళ్లు పట్టిందని చెప్పుకొచ్చాడు. మురుగదాస్ ఈ చిత్రం షూటింగ్‌కి ముందు అద్భుతమైన కథ, అత్యద్భుతమైన ఫొటోగ్రఫీ, సౌందర్యంగా ఉండే లోకేషన్స్... ఇలా అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి... రెండు గంటల ఇరవై అయిదు నిమిషాలు ప్రేక్షకులను స్టన్ చేయాలని తనతో చెప్పాడని, రేపు ప్రేక్షకులే కాదు.. డబ్బింగ్ చెప్పే సమయంలో నేనే స్టన్ అయ్యాను సార్.. అంటూ మురుగదాస్‌ని ఉద్దేశించి అన్నాడు. ఇక సినిమాటోగ్రాఫర్ సంతోష్‌శివన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, ఆయన ఇండియాలోనే టాప్ సినిమాటోగ్రాఫర్ అని చెప్పాడు. ఆయన సాధారణంగా ఏ చిత్రం వేడుకలకు రారు.. మరి ఆయనను పెట్టుకుని నన్ను 'జై బాబు.. జై బాబు' అంటూ అభిమానులు పిలవడం ఏమిటని జోక్ చేశాడు. ఇక మహేష్ ప్రసంగం తర్వాత వేదిక దిగి వెంటనే వచ్చి రకుల్‌ప్రీత్‌సింగ్ గురించి చెప్పడం మర్చిపోయాను, మురుగదాస్‌గారు కూడా ఆమె గురించి చెప్పడం మర్చిపోయారని స్పాంటేనియస్ గా స్పందించాడు.
ఇక ఆయన మీలాంటి అభిమానులు ఎవరికి ఉండరని ఖచ్చితంగా చెప్పగలను అన్నాడు. దాంతో ఆయన ఏం చెప్తాడో అని అందరు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నప్పుడు 'మీరు నా సినిమా నచ్చితేనే చూస్తారు.. నచ్చకపోతే చూడరు' అని చెప్పాడు. ఇది నిజంగా అక్షరసత్యం. సినిమా ఎంత బాగాలేకపోయినా మొదటి వారం రోజులు కలెక్షన్లు బద్దలు కొట్టాలని పనిగట్టుకుని ప్రచారం చేయడం మహేష్ అభిమానుల్లో లేదు. ఇతర హీరోల అభిమానులలాగా సినిమా అంత వసూలు చేసింది... ఫ్లాప్ అయినా సరే ఇంత వసూలు చేసింది.. సినిమా బాగానే ఉంది.. వంటి బిల్డప్‌లు మహేష్ ఫ్యాన్స్‌లో ఉండదు. దానికి ఉదాహరణగా 'ఆగడు, బ్రహ్మోత్సవం' చిత్రాలనే చెప్పవచ్చు. సినిమా బాగాలేదని మహేష్ ఫ్యాన్సే స్వయంగా చెప్పారు. రెండోరోజు నుంచే కలెక్షన్లు డ్రాప్‌అయ్యాయి. కాబట్టి మహేష్ తన ఫ్యాన్స్ గురించి అలా చెప్పడంలో ఆయన నిశిత, సూక్ష్మపరిశీలన దాగుంది.