గ్లోబెల్స్ ప్రచారం అంటే ఏమిటో చాలామందికి తెలుసు. చెప్పిన అబద్దాలనే మరలా మరలా చెబుతూ దానిని నిజం అని నమ్మేలా చేయడమే గ్లోబెల్స్ కళ. ఇక దీనిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరితేరిపోయాడని చెప్పవచ్చు. మరి ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడిది కూడా అదే దారి. చేసిన పనులను కూడా చేయలేదనడం జగన్ వైఖరి అయితే, జరగనివి కూడా జరిగినట్లు చెప్పడం చంద్రబాబు నైజం. వాస్తవానికి ఇప్పుడున్న చంద్రబాబుకి కిందట 9ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు వైఖరిలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడు ఆయన వద్దకు ఒక సమస్య వచ్చిందంటే దాని అంతుతేలే దాకా వదిలేవాడు కాదు. ఛండశాసనునిగా పేరు తెచ్చుకుని, ఏపని చేస్తే ఏ కులం ఓట్లు వస్తాయి? ఏ పని చేస్తే ఎవరి ఓట్లు పోతాయి అని ఆలోచించేవాడు కాదు. కానీ ప్రస్తుతం ఆయన దానికి వ్యతిరేక ధోరణిలో ప్రవర్తిస్తున్నాడు.
నిజానికి చంద్రబాబు రాజధానిగా అమరావతిని ఎంచుకోవడం నుంచి ఆయన ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది , కాంట్రాక్ట్‌లు, కులాల కార్పరేషన్‌లు.. ఇలా ప్రతి విషయంలోనూ జన్మభూమి కమిటీలని, బ్రాహ్మణ, కాపు వంటి కులాల వారికి ఇచ్చిన కార్పొరేషన్ ఫండ్ విషయం దాకా ఆ పథకాల నిదులన్నీ పచ్చచొక్కా వారికే దక్కుతూ, పేదలకు అందించాల్సిన సహాయం మొత్తం పసుపు చొక్కా వారి జేబుల్లోకి వెళ్తోంది. దీనితో పాటు ప్రభుత్వశాఖల్లో మరీ ముఖ్యంగా పోలీస్, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, విద్య, వైద్యం, మరీ ముఖ్యంగా రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లలో అవినీతి రాజ్యమేలుతోంది. ఉద్యోగులు, ఇతరుల అవినీతి పెచ్చుమీరింది. ఎవ్వరినీ చూసి వారు భయపడటం లేదు. పేదవారిని నానా తిప్పలు పెడుతూ, చేతికందినంతా దోచుకుంటున్నారు. అన్ని తెలిసినా బాబు కళ్లు మూసుకుని పిల్లి పాలు తాగిన సామెత గుర్తుకొస్తోంది.
ఇక చంద్రబాబు వచ్చే ఎన్నికలలోపు రాజధాని అమరావతిని గానీ,పోలవరం ప్రాజెక్ట్‌ను కూడా ఇప్పుడే పూర్తి చేయలేడు. వచ్చే ఎన్నికల వరకు నాన్చి మరలా ప్రజలందరూ చంద్రబాబు వస్తేనే రాజధాని వస్తుంది.. బాబు వస్తేనే పోలవరం వస్తుందనే భ్రమను సృష్టించడానికే ఆయన తాపత్రయ పడుతున్నాడు. ఇక ప్రతిపక్షం రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తూ, సంక్షేమ పథకాల ద్వారా ముందుకు వెళ్తుంటే తమ ఉనికి ఎక్కడ దెబ్బతింటుందోనని వారు అడ్డుపడుతున్నారన్నాడు. ప్రజల కోసం రాజధాని నిర్మిస్తున్నాం గాన ప్రతిపక్ష పార్టీ కోసం కాదని సెటైర్ వేశాడు. రాష్ట్రంలో ప్రజలు ప్రతిపక్షాన్ని మర్చిపోయారని అంటున్నాడు.
తాజాగా అమరావతి డిజైన్ల కోసం నార్మన్ పోస్టర్ సంస్థ ఆకృతులను సిద్దం చేస్తోందని, ఆలస్యమైనా ఫర్వాలేదని, అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పి వచ్చే ఎన్నికల లోపు రాజదాని పూర్తవ్వదని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేశాడు. ప్రస్తుతం పనిచేస్తున్న ఆర్కిటెక్ట్‌లతో పాటు రాష్ట్రంలోని మరింత మంది ఆర్కిటెక్ట్‌లను కలుపుకుని పనిచేయాలన్నారు. చివరగా వీరంతా కలిసి రాజమౌళి దగ్గరకు వెళ్లి, ఆయన సలహాలు తీసుకోవాలన్నారు. దేశంలో ఇంత మంది నిపుణులు ఉండగా, ఏరికోరి ఏదో 'బాహుబలి' తీశాడని అధికారులు, నిపుణులను రాజమౌళి సలహా తీసుకోవాలని చెప్పడం ఏమిటో తెలియదు. సినిమా అనేది కూడా విజనే. కానీ సినిమాలలోని విజన్ కేవలం తాత్కాలికం.. కానీ నిజజీవితంలో విజన్ అనేది కొందరికే సొంతం. దాంతో రాజమౌళిని సలహాలు తీసుకోవాలని అధికారులకు చెప్పడంపై పలు సెటైర్లు వినిపిస్తున్నాయి.