తాము ఏ వేడుకకి వస్తే వారిని, ఎవరితో చిత్రం చేస్తుంటే వారిని తమకిష్టమైన నటులు అనిచెప్పడం, ఇంతటి అందగాడు ప్రపంచంలోనే ఉండదని చెప్పడం, అచ్చు హాలీవుడ్ హీరోగా ఉన్నాడని, క్రమశిక్షణ, సింప్లిసిటీ, ఆయా హీరోలు ఇమేజ్, క్రేజ్‌లను గూర్చి అందరూ దర్శకులు చెబుతారు. అంటేవారు ఏస్టార్‌తో చిత్రం చేస్తారో, చేస్తున్నారో ఆ చిత్రం విడుదలయ్యే వరకు ఆ దర్శకులు ఆ స్టార్ భజనే చేస్తుంటారు. ఇక మురుగదాస్ వంటి దర్శకుడు కూడా అదే బాట పట్టాడా..? అంటే అవుననే చెప్పాలి.
తమిళనాడులో అజిత్, విజయ్ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇక దర్శకునిగా మురుగదాస్‌లోని టాలెంట్‌ని చూసి ఆయనకు హీరోగా అవకాశం ఇచ్చిన స్టార్ అజిత్. ఆసమయంలో ఆయన ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో మాట్లాడినా అజిత్ పొగడ్తలే ఉండేవి. తర్వాత ఆయన విజయ్‌తో పనిచేసేటప్పుడు విజయ్ కన్నా అందగాడు లేడని, ఆయనలా నటించేవారిని తాను చూడలేదని, విజయ్ అంటే తనకు ఎంతో పిచ్చి అని చెప్పాడు. దాంతో నాడు తమిళనాడులో మురుగదాస్‌కి తమ హీరో అంటే ఇష్టమని, కాదు.... కాదు మా హీరోనే ఆయనకు ఇష్టమని గొడవలు జరిగాయి. అసలు మురుగదాస్‌కి తమ హీరో చిత్రమే స్టార్‌ని చేసిందని కొందరు. కాదు.. అసలు ఆయనకు చాన్స్ ఇచ్చిందే మా హీరో అని నాడు అజిత్, విజయ్ ఫ్యాన్స్‌లు గొడవలు చేశారు.
ఇక తెలుగులో కూడా మురుగదాస్ అదే పనిచేశాడు. నాడు ఆయన చిరంజీవితో 'స్టాలిన్' చిత్రం సందర్భంగా విజయవాడలో జరిగిన 'ఇంద్ర' ఫంక్షన్ చూసి అబ్బురపడ్డానని, ఆయనైతేనే 'స్టాలిన్'ని చేయగలడని, ఎన్ని తరాలు, యుగాలు వచ్చినా చిరంజీవినే నెంబర్‌వన్ అని, ఆయనతో చిత్రం తీసిన తర్వాతే తన జీవితం ధన్యమైందని తెలిపాడు. ఇక ఇప్పుడు ఆయన మహేష్ నటించిన 'ఒక్కడు' చిత్రం చూసి స్టన్ అయ్యానని, ఆ చిత్రాన్ని విజయవాడ థియేటర్‌లో చూశానని చెప్పాడు.
కాగా మురుగదాస్ 'ఇంద్ర' వేడుకకి విజయవాడకు వచ్చిన సమయంలోనే ఆయన మహేష్ 'ఒక్కడు' చూశాడు. దీని గురించి ఆయన మాట్లాడుతూ, నేను థియేటర్లలో ఆ చిత్రం చూడటానికి వెళ్లినప్పుడు అప్పుడు ఆ చిత్రం మూడో వారం. అయినా థియేటర్లు హౌస్‌ఫుల్ అయిన ప్రతి సీన్‌కి చప్పట్లు, ఈలలతో నిండిపోయింది. నాటి నుంచి తాను మహేష్‌కి పెద్ద ఫ్యాన్‌ని అయ్యానని, ఆయన తన జీవితంలో ఉన్న, తన మనసులో ఉన్న ఒకే ఒక్కస్టార్ అనిచెప్పాడు. ఇక తాజాగా ఆయన రజనీకాంత్ కోసం ఆయనలాంటి హీరోలేడని, రజనీ భజన మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.