ఒకప్పుడు కమెడియన్‌గా వేణుమాధవ్ బాగా బిజీగా ఉండేవాడు. తనకున్న క్రేజ్‌ని ఉపయోగించుకుని భారీ రెమ్యూనరేషన్లు, రియల్ ఎస్టేట్స్ వంటి పలు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి కోటీశ్వరుడు అయ్యాడు. దాంతో ఇంకేముంది... తానే 'ప్రేమాభిషేకం, భూకైలాస్' వంటి చిత్రాలను తానే హీరోగా నిర్మించి దెబ్బైపోయాడు. ఆ తర్వాత సినిమాలలో పెద్దగా కనిపించడం లేదు. తాజాగా ఆయన రాజకీయాలపై కన్నేశాడు. ఇక ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి సంగతి తెలిసిందే. ఎప్పుడు ఆయన సినీ రంగానికి చెందిన వారిపై ఎక్కువ ఆసక్తి చూపుతాడు. కేవలం పెద్ద హీరోలనే కాదు. కవిత, వాణిజయరాం.. చివరకు వేణుమాధవ్‌ని కూడా వదలలేదు. ఏకంగా నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో వేణుమాధవ్‌కి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చాడు.
ఒక వైపు జగన్.. చంద్రబాబుని నడిరోడ్డులో కాల్చివేయాలి.. ఉరితీయాలి. నిక్కర్లు ఊడదీయాలి.. అని మాట్లాడుతుంటే నంద్యాల ప్రజలే కాదు.... ఇతర నాయకులు, రాజకీయ విశ్లేషకులు ఇది సరైన సంప్రదాయం కాదని భావించి, జగన్ వ్యాఖ్యలు సరికాదని, ఎంతైనా చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని మరిచిపోవద్దని, సైద్దాంతికంగా విమర్శించవచ్చుగానీ మరీ బజారు వ్యాఖ్యలు, దిగజారుడు స్టేట్‌మెంట్స్ ఇవ్వకూడదని చెప్పారు. తాజాగా మాజీ కాంగ్రెస్ ఎంపీ, అనుభవశాలి అయిన ఉండవల్లి కూడాఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అందరూ ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ బాబుకు సానుభూతి తెలుపుతూ ఉన్న సమయంలో రాజకీయ అవగాహనలేని వేణుమాధవ్ టిడిపి తరపున ప్రచారం చేస్తూ, చంద్రబాబు సమక్షంలోనే జగన్, రోజాలను కించపరుస్తూ జగన్ 'ఓ బటేబాజ్' అని, సినిమా ఫీల్డ్‌లో రోజా ఎవరో కూడా తనకు తెలియదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చంద్రబాబు పెద్దరికానికి చెడ్డపేరు తెచ్చాడు.
మొత్తానికి ఏదో విధంగా నంద్యాలలో టిడిపి గెలవడంతో అదంతా తన వల్లనే అనే భ్రమలో వేణుమాధవ్ వున్నట్లున్నాడు. ఇక ఆయన పవన్‌కళ్యాణ్ చిత్రాలలో కూడా కమెడియన్‌గా చేసి ఉన్నాడు. తాజాగా ఆయన ఓచానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేయదని, పవన్ ప్రత్యక్ష రాజకీయాలలోకి రాడని చెప్పి ఏదేదో మాట్లాడాడు. ఇక వచ్చే ఎన్నికల్లో పవన్, జనసేనల మద్దతులేకుండా టిడిపి గెలుస్తుందంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. బహుశా దీనినే అనుభవలేమి అని అంటారేమో..! ఇక నంద్యాల ఎన్నికల్లో జగన్, రోజాలను తిట్టడానికి ఎంత డబ్బు తీసుకున్నారని ప్రశ్నించగా సంబంధం లేని ఏవేవో మాట్లాడాడు.ఇక నెటిజన్లు వేణుమాధవ్ బయటికి చెప్పుకోలేని వ్యాధితో బాధపడుతున్నాడు అంటున్నారని ప్రశ్నించగా కావాలంటే వారికి అడిగినంత బ్లడ్ ఇస్తాను...పరీక్షలు చేయించుకోండి అంటూ ఊగిపోయాడు. కాగా కొంతకాలం కిందట మీడియాలో వేణుమాధవ్ మరణించాడని కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.