స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దాదాపుగా 90శాతం కాలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే నిలిపింది. కానీ ఆ సమయంలో కేవలం రాజకీయ ఎత్తుగడలతోనే కాలం వెళ్లదీసింది. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశంలో ఈ సమస్య ఉంది... ఆ సమస్య ఉంది... పేద ప్రజలు, దళిత, బలహీన, మైనార్టీ వర్గాలకు ఈ సమ్యలు ఉన్నాయని వల్లెవేసింది. మరి దాదాపు 60ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు నాడు ఈ సమస్యలు కనిపించలేదా? ఇవి ఎప్పటినుంచో ఉన్నవే కదా..! గరీభీ హఠావో, జై..జవాన్.. జైకిసాన్ అని నినదించిన కాంగ్రెస్ తాను అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వీటిని పరిష్కరించలేదు. మరి అన్నేళ్లు అధికారంలో ఉండి అన్ని రంగాలను భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ కేవలం నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చిన మోదీనే అన్నీ పరిష్కరించాలని కోరడంలో సమంజసం ఉందా?
ఇక కాంగ్రేస్సే కాదు ఎన్టీయే కాలంలో కూడా నాడు వాజ్‌పేయ్, నేడు మోదీలు దేశంలోని సమస్యలను చెప్పడానికి ప్రయత్నిస్తున్నారే గానీ సమస్యలను పరిష్కరించడం లేదు. ఇలా అందరూ సమస్యలు చెప్పే వారే ఉంటే ఇక అధికార పక్షానికి, విపక్షాలకు తేడా ఏముంది? అసలు మన దేశంలో అమెరికా తరహా ఎన్నికలు, నేరుగా ప్రధానిని ఎంచుకునే ఎన్నికలు అవసరమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అది వీలు కాకపోతే కనీసం దేశమంతా ఒకేసారి జమిలి ఎన్నికలు జరపడం కూడా మేలే చేస్తుంది. దీనికి కారణం ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి ఉప ఎన్నికలు వస్తుండటంతో మన నాయకులు ఆ ఎన్నికల్లో ఎలా గెలవాలా? అని ఆలోచిస్తున్నారు తప్ప ప్రజలను పట్టించుకోవడంలేదు. కేవలం ఎక్కడ ఉప ఎన్నికలు జరిగితే ఆయా నియోజకవర్గాలకే తాయిలాలు ఇస్తున్నారు.
ఇక ప్రస్తుతం మోదీకి కేంద్రంలో పూర్తి మెజార్టీ ఉంది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులను రాజకీయంగా చూడకూడదు. కానీ వారు కూడా బిజెపికి సంబంధించి ఎన్నికైన వారే. అయినా కూడా తాజాగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశంలో మహిళల అక్షరాస్యత పెరగాలని, కేవలం ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, మిగిలిన సమయాల్లో ప్రజా సమస్యలు పరిష్కరించాలని సెలవిచ్చారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులు బిజెపి వారే కదా...! మరి ఆయన కేవలం ఆ సమస్య ఉంది.. ఈ సమస్య ఉందని చెప్పడం కాదు..... వాటి నిర్మూలనకు ఏం చర్యలు చేపడుతున్నారో చెప్పగలగాలి. అప్పుడే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులు కేవలం రబ్బర్‌స్టాంప్‌లుగా కాకుండా తమదైన శైలిలో నిర్ణయాలు తీసుకోవాల్సిన వారుగా గుర్తింపు పొందుతారు!