ఒకనాటి హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది అమల. చేసింది తక్కువ చిత్రాలే అయినా తన నటనతో, ఆటపాటలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. చిరంజీవి, నాగార్జున వంటి సీనియర్‌స్టార్స్‌లో కలిసి నటించింది. ఆ తర్వాత అక్కినేని నాగార్జునను ప్రేమించి పెళ్లి చేసుకుని అక్కినేని వారింట అడుగుపెట్టింది. ఇక వివాహం తర్వాత ఆమె స్వతంత్రంగానే సినిమాలకు దూరంగా జరిగింది. ఆమె నటించడంపై నాగార్జునకి ఎలాంటి అభ్యంతరాలు లేవు. అయినా ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటూ బ్లూక్రాస్ సంస్థతో పాటు రెడ్‌క్రాస్‌కి, ఇతర స్వచ్చంధ సంస్థల కార్యక్రమాలలో ఎక్కువ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తోంది. అన్ని జంతువులనే కాదు చివరికి వీధికుక్కల రక్షణ బాధ్యతలను కూడా ఆమె తీసుకుంటోంది.
నెల్లూరుజిల్లాలోని వెంకటగిరిలో జరిగే పోలేరమ్మ జాతరలో బలులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆమె స్వయంగా తన ఖర్చులతో వెంకటగిరికి వచ్చి ప్రజలను చైతన్యవంతులని చేసింది. ఇక తాజాగా ఆమె స్వచ్చభారత, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటోంది. హైదరాబాద్‌లోని మియాపూర్ జనప్రియ పశ్చిమనగరంలో శేరిలింగం పల్లి ఎమ్మెల్యే గాంధీతో కలసి ఆమె రోడ్లను ఊడ్చి శుభ్రం చేసి పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. గుంతలు పడిన రోడ్లకు మరమ్మత్తులు చేసి, కంకర, ఇసుక, మట్టితో గుంతలను పూడ్చింది. ఆ తర్వాత పారిశుద్ద్య కార్మికుల కోసం రేడియం జాకెట్లు, చేతులకు వేసుకునే గ్లౌవ్స్‌ని పంపిణీ చేసింది.
ఈ సందర్భంగా అందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పిల్లలకు పాఠశాల స్థాయి నుంచే పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలని కోరింది. ఇక వచ్చే ఎన్నికల్లో ఆమె ఓకే అంటే తెలుగుదేశం పార్టీ కృష్ణ, గుంటూరు జిల్లాలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటును ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నాడు. మరి దీనికి అమల - నాగార్జున ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సివుంది. మరోవైపు ఈ జంటలో ఒకరికి వారు కోరుకున్న స్థానంలో సీటు ఇవ్వడానికి జగన్ కూడా సుముఖంగా ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది.