తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్‌గా తిరుగేలేని ప్రజాదరణ తెచ్చుకున్న వ్యక్తి చిరంజీవి. సినిమా రంగంలో ఆయన మాటకు తిరుగుండదు. కానీ ఆయన రాజకీయాలలో వచ్చిన తర్వాత సహజమైన విమర్శలను సరిగా ఎదుర్కోలేకపోయాడు. సినిమా ఫీల్డ్‌లో పనిచేసిన ఆయన మోనార్కిజం రాజకీయాలలో జరిగే పని కాదని ఆయనకు తెలిసి వచ్చింది. పాలిటిక్స్‌లో ఎంతటివారైనా బురద చల్లించుకోవాల్సిందే. ఇలా సినిమాలో మెగాస్టార్ కాస్తా రాజకీయాలలో జీరో స్టార్ అయ్యాడు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి సొంతగా రెండు పదుల ఎమ్మెల్యేలను కూడా సంపాదించుకోవడంలో విఫలమయ్యాడు. అదే విధంగా ఎలాగోలా పార్టీని నిలిపి ఉంటే వైఎస్ మరణం, జగన్ అనుభవలేమి, చంద్రబాబుపై వ్యతిరేకత వంటివి ఆయనకు కలిసొచ్చేవి. కానీ తొందరపడి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, సోనియా కాళ్ల వద్ద తనకు ఓటేసిన లక్షల మందిని తాకట్టుపెట్టాడనే చెడ్డపేరు తెచ్చుకున్నాడు. ఇక విలీనం పుణ్యమా అని ఆయనకు రాజ్యసభ ఎంపీ సీటు, కేంద్రమంత్రి పదవి కూడా వచ్చాయి.
ఇక రాష్ట్రాన్ని కాంగ్రెస్ అడ్డదిడ్డంగా విభజించడంతో ఏపీలో కాంగ్రెస్ పని ఖాళీ అయింది. అది మరలా పుంజుకునే పరిస్థితి కూడా లేదు. నంద్యాల ఉప ఎన్నికల్లో వందల స్థాయిలోనే ఓట్లు వచ్చాయి. సో.. ఇప్పుడు ఆయన కాంగ్రెస్‌లో ఉన్నా ఒరగదీసేది ఏమీ లేదు. అందుకే ఆయన ఎన్నికల ప్రచారాలకు, సమావేశాలకు కూడా వెళ్లడం లేదు. చిరంజీవి ఎందుకు రాలేదు? అని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి నుంచి సీనియర్ నాయకులను మీడియా వారు ప్రశ్నించినా, తమకు తెలియదని, లేదా ఆయన ఏదో బిజీగా ఉండటంతో రాలేకపోయాడని వివరణ ఇస్తూ వచ్చారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఇంత దయనీయంగా ఉండటం, కోలుకునే అవకాశాలే లేకపోవడం, మరో పార్టీలోకి వెళ్లితే మరింత చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశ్యంలో మెగాస్టార్ ఉన్నాడట.
అందుకే తన రాజ్యసభ ఎంపీ పదవీ కాలం వచ్చే ఏడాది ముగియనున్న నేపథ్యంలో చిరంజీవి పర్మినెంట్‌గా రాజకీయాలకు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నాడు. మరోవైపు పవన్ రాబోయే 2019 ప్రత్యక్ష ఎన్నికలకు జనసేనతో రెడీ అవుతుండగా, మెగాస్టార్ రాజకీయాలను నుంచి నిష్క్రమిస్తుండటం విశేషం. ఇక ఆయన కాంగ్రెస్‌లో కొనసాగే కొద్ది పవన్‌పై ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి మౌనంగా రాజకీయాల నుంచి నిష్క్రమించి పరోక్షంగా తనను, తన ఫ్యాన్స్‌ని అందరిని పవన్‌ని సపోర్ట్ చేయమని చెప్పే అవకాశం ఉంది. అదే కాంగ్రెస్‌లో ఉంటే అది వీలుకాదు. సో.. ఆ దిశగా మెగాస్టార్ ఆలోచనలు కొనసాగుతున్నాయని, 'ఖైదీ నెంబర్ 150', 'సై..రా.. నరసింహారెడ్డి' తర్వాత కూడా ఆయన పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టనున్నాడని సమాచారం.