తెలుగులో ఒకప్పుడు రవిరాజా పినిశెట్టి, తర్వాత భీమనేని శ్రీనివాసరావు అనే రీమేక్ స్పెషలిస్ట్‌లు ఉండేవారు. అదేకోవకు చెందిన చిన్న దర్శకుడు తాతినేని సత్య. ఆయన ఇప్పటివరకు తీసిన మూడు చిత్రాలు రీమేక్‌లే కావడం విశేషం. ఆయన తీసిన 'భీమిలి కబడ్డీజట్టు, ఎస్‌ఎంఎస్, శంకర'.. ఇలా మూడు చిత్రాలు రీమేక్‌లే. అయితే ఇందులో ఒక్క చిత్రం కూడా మంచి విజయం సాధించలేదు. ఇక ఆయన తాజాగా ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త తనయుడు, భారీ బిజినెస్‌మేన్ సచిన్‌జోషి హీరోగా 'వీడెవడు' చిత్రం రూపొందించాడు. తాజాగా విడుదలైన ఈ చిత్రాన్ని మాత్రం తాతినేని సత్య ఓన్ కథతో తీశాడు.
ఎన్ని సినిమాలు చేసినా ఆదరణ లభించని సచిన్‌జోషి ఇలా వరుసగా తెలుగు ప్రేక్షకులను వదలకుండా తన వద్ద మూలుగుతున్న డబ్బుతో ఎలాగైనా హీరో అనిపించుకునే బాపత్తు కావడంతో.. ప్రేక్షకులు ఎవ్వరూ 'వీడెవ్వడు' చిత్రం గురించి పట్టించుకోవడం లేదు. కానీ ఈ చిత్రం ఆడకపోయినా దర్శకుడు బాగా తీశాడు.. అనే పేరు వస్తే చాలనే మూడ్‌లో తాతినేని సత్య ఉన్నాడు. ఈ చిత్రంతో మంచి దర్శకునిగా తనకు పేరొస్తే తాను నానిని కలిసి ఓ కథ చెబుతానంటున్నాడు.
ఎందుకంటే ఈయన తీసిన 'భీమిలి కబడ్డీ జట్టు'లో నాని హీరోగా నటించాడు. కానీ నాటి నానికి, నేటి నేచురల్ స్టార్ నానికి ఎంతో తేడా ఉంది. సినిమా చేయడం పక్కన సంగతి కనీసం సత్య చెప్పే కథను వినే సమయమైనా నానికి ఉందా? అనే డౌట్ వస్తుంది. ఇక నాని అప్పట్లో తన కెరీర్ ప్రారంభంలో తనకు 'అష్టాచెమ్మా' చిత్రంలో చాన్స్ ఇచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణకు ఆయన దర్శకునిగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 'జెంటిల్‌మేన్'కి చాన్స్ ఇచ్చి తన గురు భక్తిని చాటుకున్నాడు. మరి అదే తరహాలో తనకు కూడా నాని ఖచ్చితంగా అవకాశం ఇస్తాడనే నమ్మకంతో తాతినేని సత్య ఉన్నాడు. మరి ఆయన కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సివుంది...!