తాజాగా పవన్‌కళ్యాణ్ ట్విట్టర్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య రెండుమిలియన్లకు చేరింది. జనసేన అధినేతగా, సినీస్టార్‌గా ఉన్న ఆయన ఇలా 20లక్షల ఫాలోయర్స్‌ని సంపాదించుకోవడం పలువురు పెద్ద విషయం కాదంటారు. కానీ పవన్ విషయంలో మాత్రం దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది. మిగిలిన హీరోలకు ఇంతకంటే ఎక్కువ మంది ఫాలోయర్స్ ఉండవచ్చు. కానీ వారు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. కానీ పవన్ అలా కాదు. ఇక మిగిలిన హీరోలు తమ సినిమా అప్‌డేట్స్‌ని, పర్సనల్‌లైఫ్ విషయాలను ట్విట్టర్ ద్వారా తెలుపుతుంటారు కాబట్టి వారికి ఈ సంఖ్య పెద్దదిగా అనిపించకపోవచ్చు. కానీ పవన్ తన ట్విట్టర్‌లో తన సినిమా విషయాలను, వ్యక్తిగత విషయాలను అసలు పోస్ట్ చేయడు. ఆయన కేవలం తన రాజకీయ భావాలను, తన పవనిజంను, సమాజంలో జరిగే విషయాలను మాత్రమే పోస్ట్ చేస్తాడు. ఆ లెక్కన చూస్తే ఈ 20లక్షల ఫాలోయర్స్ కేవలం ఆయన పొలిటికల్ భావాలు, ఆయన ఐడియాలజీని నచ్చి, మెచ్చే ఫాలోయర్స్ మాత్రమే. మరో విధంగా చెప్పాలంటే పవన్‌కి ఈ 20లక్షల మందిని రాజకీయ కార్యకర్తలుగానే భావించాల్సి వస్తుంది.
ఇక ఈ సందర్భంగా పవన్ ప్రత్యేకంగా ట్వీట్ చేస్తూ, మూడేళ్ల క్రితం జనసేన ప్రయాణం మొదలుపెట్టినప్పుడు దారంతా గోతులు.. చేతుల్లో దీపంలేదు. ధైర్యమే కవచంగా ఒకే గొంతుకతో మొదలుపెట్టాను. నేను స్పందించిన ప్రతి సమస్యకు మేమున్నామంటూ ప్రతిస్పందించి ఈ రోజు 20లక్షల దీపాలతో దారంతా వెలిగించిన మీ అభిమానానికి శిరస్సు వంచి కృతజ్ఞతలతో.. మీ పవన్ కళ్యాణ్ అని ఆయన ట్వీట్ చేశాడు.
ఇక సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే అక్టోబర్‌లో.. ప్రస్తుతం చేస్తున్న చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసి అవసరమైతే పూర్తిస్థాయిలో ప్రజాసమస్యల కోసం పోరాడటం కోసం వస్తానని చెప్పాడు. మరి పవన్ టెక్నికల్‌గా వచ్చే 2019 ఎన్నికల వరకు రాజకీయాలలో ఫుల్ బిజీగా ఉంటాడా? లేక పార్టీని నడిపేందుకు అవసరమైన నిధుల కోసం ఎవరి ముందు చేతులు చాచకుండా సినిమాలు చేస్తూ ఆ రెమ్యూనరేషన్‌నే రాజకీయాలకు ఉపయోగిస్తాడా? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.