రాజకీయ నాయకులు కావాలనే వారికి డబ్బు ఉండాలని చాలా మంది భావిస్తారు. కానీ దానికంటే మంచి మాటల చాతుర్యం, వాగ్దాటి, ఎదుటివారిని, ప్రత్యర్ధులను మాటలతో డిఫెన్స్‌లోకి నెట్టే చాతుర్యం, రాజకీయాలలోని అన్ని విభాగాలపై సరైన అవగాహన ముఖ్యం. అవి ఉండబట్టే రాజకీయాలలో తన సొంత డబ్బును పైసా కూడా ఖర్చుపెట్టలేదని స్వయంగా చెప్పిన వెంకయ్యనాయుడు ఎన్నో ఉన్నత పదవులను అలంకరించారు. ఇక నేడు వైసీపీ నాయకురాలు రోజాకి కూడా ఆమె మాటల చాతుర్యమే ఎక్కడలేని ఇమేజ్‌ని తీసుకొచ్చి, ఏకంగా ఎమ్మెల్యేగా గెలిపించి పెట్టింది. కానీ రోజా వంటి వారికి మాటల చాతుర్యం ఉంది కానీ రాజకీయ అవగాహన పెద్దగా లేదు. మరోవైపు మైసూరా రెడ్డి వంటి వారికి రాజకీయాలలో అణువణువు తెలిసినా ఆకట్టుకునే మాటల చాతుర్యం లేదు.
ఇక విషయానికి వస్తే నిన్నటి టాప్ హీరోయిన్, ఇటీవలే నటిగా రీఎంట్రీ ఇచ్చిన మలయాళీ భామ వాణివిశ్వనాథ్ త్వరలో తెలుగుదేశం తీర్ధం పుచ్చుకోనున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం టిడిపిలో రోజాను ఎదుర్కొనే ఫైర్‌బ్రాండ్ కొరత ఉంది. చివరకు ప్రతి రోజు ఉదయాన్నే పలు న్యూస్‌చానెల్స్‌లో వచ్చే రాజకీయ విశ్లేషణా కార్యక్రమాలకు సైతం అధికారంలో ఉన్న టిడిపి తరపున మాట్లాడే మంచి వాగ్దాటిలేమి కొనసాగుతోంది. మరోపక్క రోజా అసభ్యంగా మాట్లాడుతూ, అన్‌పార్లమెంటరీ పదాలు, అసభ్య సంజ్ఞలు చేస్తోంది. దాని తిప్పికొట్టే క్రమంలో టిడిపిలోని నాయకులు ప్రయత్నాలు చేస్తుంటే రోజా తాను మహిళలను అనే అంశాన్ని తెరమీదకు తీసుకొస్తోంది.
ఇక నన్నపనేని రాజకుమారి వంటి వారు వయో భారంతో ఉన్నారు. సో.. ఇది వాణివిశ్వనాథ్ సద్వినియోగం చేసుకుంటే ఆమెకు రాజకీయాలలో మంచి భవిష్యత్తు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్లుగా ఇంకా వాణి విశ్వనాథ్ టిడిపిలోకి చేరకముందే తన ఉద్దేశ్యాన్ని బహిరంగం చేసింది. వైకాపా మహిళానేత, ఎమ్మెల్యేరోజాకు మీరు ప్రత్యర్ధిగా మారనున్నారా? అన్న ప్రశ్నకు ఆమె తెలివిగా స్పందించింది. నాకు తెలుగుదేశం నాయకత్వం, సిద్దాంతాలు నచ్చాయి. రాజకీయాలలోకి వచ్చిన తర్వాత నాకు ప్రత్యర్ధులు ఎవరైనా ఒక్కటే. అయినా సరైన ప్రత్యర్ధి ఉంటేనే థ్రిల్‌గా ఉంటుందని వాణివిశ్వనాథ్ అన్యాపదేశంగా తన అంతరంగాన్ని బయటపెట్టింది.
ఎదుట ఉండేది రోజా అయినా, ఎవరైనా సామర్ధ్యంతో సమర్ధవంతంగా ఎదుర్కొంటాను... అంటూ సమాధానం ఇచ్చింది. ఓ మలయాళీ అయి ఉండి, తెలుగు రాజకీయాలపై ఎందుకు ఆసక్తి చూపుతున్నారనే ప్రశ్నకు సమాధానంగా ఆమె 'నన్ను ఆదరించింది తెలుగు ప్రేక్షకులే. చిత్ర రంగంలో నాకు గుర్తింపు కూడా ఇక్కడి నుంచే వచ్చింది. తెలుగు రాష్ట్రాలు అంటే నాకెంతో ఇష్టం. ఇండియాలో నాకు నచ్చిన నేత చంద్రబాబునాయుడు. అతని మార్గనిర్దేశకత్వంలో పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నానని' వాణీ విశ్వనాథ్ తెలిపింది.