సునీల్ హీరోగా మారిన తర్వాత ఆయన నటించిన చిత్రాలు ఆడనప్పుడల్లా సునీల్ మరలా కమెడియన్‌గా మారనున్నాడు అనే వార్తలు రావడం సర్వసాధారణమైన సంగతి ఒప్పుకోవాల్సిందే. కానీ ఈసారి ఆ విషయాన్ని మీడియా చెప్పలేదు. తన 'ఉంగరాల రాంబాబు' చిత్రం విడుదల సందర్భంగా స్వయంగా సునీలే హింట్ ఇచ్చాడు. తనకు సూటయ్యే పాత్రలను ఎంచుకుని ఏడాదికి రెండు చిత్రాలలో హీరోగా చేస్తానని, మిగిలిన సమయంలో మరలా ఒకప్పటిలా కమెడియన్ పాత్రలు చేస్తానని ఆయన చెప్పేశాడు. తాను ఎప్పటినుంచో మరలా కమెడియన్‌గా నటించాలని భావిస్తూనే ఉన్నానని, కానీ తనతో హీరోగా చిత్రాలు తీసే దర్శకనిర్మాతలు అలా చేయవద్దని తన మీద ఒత్తిడులు తేవడం వల్లే తాను కమెడియన్‌గా చేయలేకపోయానన్న విషయాన్ని ఆయన బయటపెట్టాడు.
ఇక సునీల్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150'తో పాటు పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రాలలో కూడా కమెడియన్ పాత్రలు వస్తే వద్దనుకున్న మాట వాస్తవమేనని తెలుస్తోంది. తాను నటుడిని కావడానికి హైదరాబాద్‌కి వచ్చినప్పుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఒకే రూమ్‌లో ఉండటం, వీరిద్దరి మద్య ఎంతో స్నేహ సంబంధాలు ఉండటం, ఇద్దరు ఒకేరోజున పెళ్లి చేసుకోవాలని భావించడం వంటి వన్నీ వీరి బంధాన్ని గుర్తు చేస్తాయి.
ఇక సినీ రంగంలో సునీల్‌కి త్రివిక్రమ్‌శ్రీనివాస్, రాజమౌళిలు ఎంతో సన్నిహితులు. ఈ లెక్కన చూసుకుంటే రాజమౌళి దర్శకత్వం వహించే తదుపరి చిత్రం ద్వారా కానీ, లేదా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించే చిత్రం ద్వారా కానీ సునీల్ కమెడియన్‌గా రీఎంట్రీ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది.