దేశంలోగానీ, ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీ తమను గెలిపించిన నియోజకవర్గాల అభివృద్దికే కట్టుబడి ఉంటుంది. ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల విషయంలో శీతకన్ను వేస్తూ, అభివృద్దిని నిధులు కేటాయించకుండా, పట్టీపట్టనట్లు వ్యవహరిస్తూ ఉంటుంది. కానీ ఏపీలో పరిస్థితి దీనికి పూర్తిభిన్నమని చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేష్ అంటున్నాడు. తాము అభివృద్ది విషయంలో అన్ని నియోజకవర్గాలను సమానంగా చూస్తున్నామని, ప్రతిపక్ష పార్టీలు ఉన్న నియోజకవర్గాలలో కూడా బాగా అభివృద్దిపనులు చేస్తున్నామని చెబుతున్నాడు. మరి లోకేష్ మాటలు ఎంత వరకు నిజమో తెలియదు గానీ అదే జరుగుతుంటే మాత్రం తెలుగుదేశం పార్టీని అభినందించాల్సిందే.
ఇక జగన్ దీనికి పెద్ద ఉదాహరణగా లోకేష్ చెబుతున్నాడు. ప్రతిపక్ష నేత జగన్ తమను తన నియోజకవర్గం అభివృద్ది చేయమని ఒక్కసారి కూడా అడగలేదని, కానీ పులివెందుల అభివృధ్దికి తమ ప్రభుత్వం ఏకంగా 10కోట్ల రూపాయలను మంజూరు చేసి అభివృద్ది కార్యక్రమాలు చేపడుతోందని లోకేష్ సెలవిచ్చాడు. అయితే చంద్రబాబు నాయుడు అభివృద్ది పనులు చేపట్టడం, సంక్షేమ పథకాలను బాగానే చేస్తున్నప్పటికీ ఆయన వాటిని సామాన్య ప్రేక్షకులకు తాము చేస్తున్న అభివృద్దిని, తాము తీసుకొస్తున్న సంక్షేమ పథకాలను వివరించి చెప్పి, వాటిని ప్రజలకు సన్నిహితం చేయడంలో మాత్రం విఫలమవుతున్నాడు.
అయినా అన్నీ చంద్రబాబే చేయలేడు. ఒకపక్క అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తుంటే కిందిస్థాయి చోటా నాయకులు వాటి ఫలాలను ప్రజలకు చేరకుండా తమ జేబులు నింపుకుంటూ, పచ్చదోపిడీ చేస్తున్నారు. అదే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకి మైనస్ కానుందని చెప్పవచ్చు.