జగన్ సాధారణంగా ప్రతి సభలోనూ విశ్వసనీయత, మాట తప్పను.. మడమతిప్పను... అనే మాటలను బాగా వల్లె వేస్తుంటాడు. తాను ఎన్ని కేసులు పెట్టినా భయపడలేదని, భయపడటం, శత్రుత్వం ఉన్నవారితో అంటకాగడం, మడమ తిప్పడం తమ చరిత్రలోనే లేవని చెబుతుంటాడు. కానీ ఆయన అసలు విషయాలు తెలిస్తే ఇవ్వన్నీ గాలి మాటలనే తేలిపోతుంది.
ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికున్నంతకాలం 'ఆ రెండు పత్రికలు' అంటూ దుయ్యబట్టాడు. మంచైనా చెడయినా రామోజీరావుపై మార్గదర్శి, రామోజీఫిలిం సిటీలపై తాననుకున్నది చేయాలని తపించి, రామోజీరావును ముప్పు తిప్పలు పెట్టాడు. ఇక ఆయన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని అసలు పట్టించుకోలేదు. ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని కూడా రోడ్డు విస్తరణలో భాగంగా పగుల కొట్టించాడు. ఆయన చనిపోయిన తర్వాత కొంతకాలం జగన్ కూడా అదే పంధా అనుసరించాడు.
కానీ ఆ తర్వాత మాత్రం రాజగురువుగా తన తండ్రి వ్యంగ్యంగా చెప్పే రామోజీరావుని వెళ్లి తానే కలిసి వచ్చి అక్కడ ఏవో మంతనాలు జరిపాడు. నాటి నుంచే కాస్త ఈనాడు, ఈటీవీలలో జగన్ వ్యతిరేకత, దుయ్యబట్టుడు తగ్గాయి. అదే సమయంలో ఆయన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని కూడా కలిసే ప్రయత్నం చేశాడు. కానీ అది ఎందువల్లో సఫలం కాలేదు. ఇక తాజాగా నాడు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల ప్రభుత్వాలను జగన్ పడగొట్టాలని భావిస్తే, చిరంజీవి నేను నిలబెట్టగలనని అన్నాడు. ఇక ఆ తర్వాత పవన్‌కల్యాణ్ టిడిపి, బిజెపిలకు స్నేహహస్తం ఇస్తూ, ఇప్పటికీ ప్రభుత్వానికి పెద్దగా వ్యతిరేకంగా మాట్లాడకుండా కేవలం సమస్యలపై స్పందిస్తున్న పవన్‌కల్యాణ్‌ని రోజాతో పాటు వైసీపీ నేతలందరూ విమర్శిస్తున్నారు.
'గబ్బర్‌సింగ్' కాదు 'లబ్బర్‌సింగ్' అని ఒకరు. అసలు చంద్రబాబుతో పవన్‌కి ఉన్న రహస్య ఒప్పందం ఏమిటి? పవన్ చంద్రబాబును ఎందుకు విమర్శించడం లేదు ఎందుకని? వైసీపీ నేతలు విమర్శిస్తునే ఉన్నారు. మరోవైపు నాడు చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం వల్లే కేంద్రంలోని అధిష్టానం చిరంజీవి ఉండగా, జగన్ ఎందుకని భావించే ఆయనకు సీఎం పదవి ఇవ్వలేదనే ప్రచారం కూడా ఉంది. ఇలా జగన్‌కి మొదటి నుంచి చిరంజీవి, పవన్‌లు శత్రువులు. ఇప్పుడు అదే శత్రువులని కలసి తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని జగన్ భావిస్తున్నాడట.
ఇటీవల తాను వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచే వ్యూహాన్ని చెప్పమని పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ని అడిగితే రాబోయే ఎన్నికల్లో మెగాభిమానులు, కాపుల ఓట్లు చాలా కీలకమవుతాయని, కేవలం ముద్రగడను నమ్ముకోకుండా చిరంజీవి, పవన్‌లను కూడా మచ్చిక చేసుకోమని ప్రశాంత్ కిషోర్ సూచించడంతోనే జగన్ త్వరలో చిరంజీవి, పవన్‌లతో సమావేశం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ అభివృద్ది కోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.